జెడ్పీ చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా టీఆర్‌ఎస్ గెలుచుకుంది. రెండేసి స్థానాలు పొందిన కాంగ్రెస్, బీజేపీలు మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీఆర్‌ఎస్ తన జెడ్పీటీసీ సభ్యులను శిబిరానికి తరలించింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం జెడ్పీలో జరిగే ప్రత్యేక సమావేశానికి జెడ్పీటీసీలు క్యాంపు నుంచి నేరుగా వచ్చి హాజరవుతారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. మరోవైపు ఎంపీపీ పదవుల కోసం పెద్ద ఎత్తున ముడుపుల రాజకీయానికి తెరలేచింది. స్వతంత్రుల మద్దతు కీలకంగా మారిన చోట రూ.లక్షల్లో నజరానాలతో పాటు, వైస్ ఎంపీపీ పదవిని కొందరు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఎంపీపీ పదవుల కోసం అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోనే పోటా పోటీ నెలకొనడం ఆసక్తి కరంగా మారింది. మండల పరిషత్ చైర్మన్‌ల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ వచ్చినా ఆ పార్టీ క్యాంపును నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జెడ్పీటీసీలందరినీ శిబిరానికి తరలించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేర్ ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రైవేటు వసతిగృహానికి తరలించారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మంగళవారం రాత్రికే హైదరాబాద్ రావాలని జెడ్పీటీసీలందరికి ఆ పార్టీ నుంచి ఆదేశాలందాయి. చాలా మట్టుకు జెడ్పీటీసీలు అదేరోజు రాత్రి క్యాంపునకు వెళ్లగా, కొందరు బుధవారం చేరుకున్నారు. 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను, 23 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకున్న విషయం విదితమే. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలను దక్కించుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో లేకపోయినప్పటికీ., టీఆర్‌ఎస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జెడ్పీటీసీలను క్యాంపునకు తరలించడం చర్చనీయాంశంగా మారింది.
అధినేత సూచించిన వారికే..
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. దీంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది.? వైస్‌చైర్మన్‌గా ఎవరిని ఎన్నుకుంటారనేదానిపై ఇప్పటికే ఆ పార్టీ ము ఖ్యనేతలకు సంకేతాలున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలతో సమావేశం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో అధిష్టానం నిర్ణయానికి స భ్యులందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే జె డ్పీటీసీలందరినీ ఆదేశించారు. కాగా ఈ పదవుల కోసం గెలుపొందిన జెడ్పీటీసీలు ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా ని యోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. చైర్మన్ రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగావినిపిస్తుండగా,వైస్ చైర్మన్ పదవి కోసం మోస్రా జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి స్పీకర్ పోచారం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు.
నేరుగా జెడ్పీ సమావేశానికే..
హైదరాబాద్ క్యాంపులో ఉన్న జెడ్పీటీసీలందరినీ నేరుగా జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి తీసుకురానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే జెడ్పీటీసీలందరికీ ఎన్నికల నోటీసులు అందజేశారు. దీంతో జెడ్పీటీసీ సభ్యులందరినీ నేరుగా ఆరోజు ఉదయం ఈ సమావేశానికి ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment