గులాబీ జోరు | Third Phase Polling Election End Medak | Sakshi
Sakshi News home page

గులాబీ జోరు

Published Thu, Jan 31 2019 12:18 PM | Last Updated on Thu, Jan 31 2019 12:18 PM

Third Phase Polling Election End Medak - Sakshi

సాక్షి, మెదక్‌: పల్లెల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. రెండు విడతల్లో మెజార్టీ పంచాయతీలు గెలుపొందిన టీఆర్‌ఎస్‌ మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. జిల్లాలో బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 133 పంచాయతీలు, 1031 వార్డుల్లో ఎన్నికలు జరగగా 90.28 శాతం పోలింగ్‌ నమోదైంది. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, తూప్రాన్, నార్సింగి, చేగుంట, మనోహరాబాద్‌ మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఎనిమిది మండలాల్లో మొత్తం 1,53, 354 మంది ఓటర్లు ఉండగా 1,38, 445 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 67182 మంది ఉండగా, మహిళలు 71,263 మంది ఓట్లు వేశారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి మెదక్‌ మండలంలోని మాచవరంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన స్వగ్రామం కోనాపూర్‌లో ఓటు వేశారు.

మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మూడవ విడతలో 133 పంచాయతీల్లో 505 మంది అభ్యర్థులు సర్పంచ్‌ బరిలో నిలిచారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగిన 133 పంచాయతీలకుగాను 108 చోట్ల టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 15 పంచాయతీల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా చేగుంట మండలంలోని గొల్లపల్లి, జక్రంతండా, చిట్టోజిపల్లిలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్క సర్పంచ్‌ అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోయారు. దీంతో పల్లెల్లో టీడీపీ జాడ లేకుండా పోయింది.
 
మూడు విడతల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా..
జిల్లాలో మూడు విడతల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ పంచాయతీల్లో విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలకుగాను 84 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 385 పంచాయతీలకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 385 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 358 పంచాయతీల్లో టీఆర్‌ఎస్, 73 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే మూడు పంచాయతీల్లో బీజేపీ, 35 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొదట విడతగా  122 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 82 టీఆర్‌ఎస్, 28 కాంగ్రెస్, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో 130 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 84 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, 30 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు, 16 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

బుధవారం  మూడవ విడత 133 పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 108 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, 15 పంచాయతీల్లో కాంగ్రెస్, మూడు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మెజార్టీ పంచాయతీల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మూడవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌ అభ్యర్థులు గ్రామాల్లో విజయోతవ్స ర్యాలీలు నిర్వహించారు. మెదక్‌ మండల జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి స్వగ్రామం బాలానగర్‌లో కాంగ్రెస్‌ మద్దతుదారు వికాస్‌ 23 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ మద్దతుదారు గోపాల్‌పై గెలుపొందారు. మాచవరంలో కాంగ్రెస్‌ మద్దతుదారు సంధ్యారాణి 165 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ బలపర్చిన రాధికపై విజయం సాధించారు. మంబోజిపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారు ప్రభాకర్‌ నాలుగు ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • నిజాంపేట మండలం చల్మెడలో నర్సింహారెడ్డి 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నార్లపూర్‌ పంచాయతీలో కాంగ్రెస్‌ జిల్లా నేత అమరసేనారెడ్డి టీఆర్‌ఎస్‌ మద్దతుదారుపై విజయం సాధించారు. 
  • చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్‌లో మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కామారంలో బీజేపీ మద్దతుదారు రాజిరెడ్డి ఓటమిపాలయ్యారు. 
  • తూప్రాన్‌ కోనాయిపల్లి(పిబి) గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి కంకణాల పాండు, టీఆర్‌ఎస్‌ మద్దతుదారు విఠల్‌కు 143 చొప్పున సరిసమానం ఓట్లు వచ్చాయి. దీంతో టాస్‌ వేయగా స్వతంత్ర అభ్యర్థి పాండు గెలుపొందారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో ఆరుగురు పోటీ చేయగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారు మన్నె మహాదేవి గెలుపొందారు. 
  • మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. ముప్పిరెడ్డిపల్లిలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారు ప్రభావతి గెలుపొందారు. మనోహరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారు చిట్కుల్‌ మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement