Centre Seeks Details on Deadly Turns Bengal Panchayat Polls - Sakshi
Sakshi News home page

రక్తపాతం నడుమే ముగిసిన పోలింగ్‌.. పెరుగుతున్న మృతులు.. బెంగాల్‌ హింసపై కేంద్రం ఆరా

Published Sat, Jul 8 2023 7:01 PM | Last Updated on Sat, Jul 8 2023 7:17 PM

Centre Seeks Details On Deadly Turns Bengal panchayat polls - Sakshi

పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌లో చెలరేగిన ‘రాజకీయ’ హింసా.. హత్యలకు దారి తీయడంతో పశ్చిమ బెంగాల్‌ నెత్తురోడింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 15 మంది దాకా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే.. గంటలు గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది.  మృతుల్లో అధికంగా అధికార టీఎంసీ కార్యకర్తలు, నేతలే ఉండగా..  బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ కార్యకర్తలూ ఉన్నట్లు తెలుస్తోంది.

బెంగాల్‌ హింసపై కేంద్రం ఆరా తీసింది. ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలంటూ బెంగాల్‌ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కేంద్ర బలగాలు విధులకు దూరంగా ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తుండగా.. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంలో తడబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇది బెంగాల్‌ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

పోలింగ్‌ మొదలైన కాసేపటికే..
రాష్ట్రవ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా..  ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.

💥 అయితే.. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద కొట్లాటలు జరిగాయి.  కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్‌ బాక్సుల్ని ఎత్తుకెళ్లడం.. బ్యాలెట్‌ పత్రాలను దహనం చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

💥 రాణినగర్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు.

💥 డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సుల్లో పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓట్లు వేశారని బీజేపీ ఆరోపించింది.

💥 జల్‌పాయ్‌గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్‌ ఆరోపించింది.

💥 బాంబులు విసురుకోవడం, కాల్పులు.. ఇలా జరిగిన దాడుల్లో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. 

‘‘ఎన్నికల వేళ దిగ్భ్రాంతికర ఘటనలు జరుగుతున్నాయి. మా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయి?’’ అని టీఎంసీ మండిపడింది. అయితే..

ఈ ఎన్నికల కోసం 600 కంపెనీల కేంద్ర బలగాలు.. 70 వేల మంది బెంగాల్‌ పోలీసులు మోహరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  2018లో జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది. అప్పుడు హింసాత్మక ఘటనలే జరిగాయి. 

ఇదీ చదవండి: షిండేకు షాక్‌ తప్పదు ఇంకా.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement