న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో 2021 ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత జరిగన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు (బెంగాల్ కాకుండా) బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది.
కాగా ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన కేసు దర్యాప్తును కల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న కారణంతో ఈ 45 కేసులను బెంగాల్ నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం.. బెంగాల్‌లోని మొత్తం న్యాయవ్యవస్థపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై తప్పుపట్టింది. సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ఉద్దేశించి బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బదిలీ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది.
‘మిస్టర్ రాజు.. బెంగాల్‌లోని అన్ని కోర్టులు ఘర్షణ వాతావరణంలో ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి ఆధారాలు ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు? విచారణలు సక్రమంగా జరగడం లేదని, అక్రమంగా బెయిళ్లు ఇస్తున్నాయని ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ మొత్తం ఘర్షణ వాతావరణంలో పని చేస్తోందనేలా పిటిషన్ ఉంది. మీ అధికారులకు (సీబీఐ) జ్యుడీషియల్ అధికారులంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి ప్రకటనలు చేయవద్దు’ అని సీబీఐకి సూచించింది.
ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకి తగిన కేసని.. న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం బెదిరించింది. అయితే న్యాయవ్యవస్థపైన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా లేవని ఏఎస్‌జీ రాజు చెప్పారు. పిటిషన్ రాతలో కొంత లోపం ఉన్నట్లు అంగీకరించి క్షమాపణలు కోరవడంతో కోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదు. అనంతరం పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమంతించింది. దీంతో కొత్త పిటిషన్‌ను సమర్పిస్తామని ఎస్పీ రాజు కోర్టుకు తెలపడంతో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment