ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్‌ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్‌ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment