సాక్షి, వికారాబాద్: ప్రాదేశిక సమరం పూర్తి కాకముందే మరో ఎన్నికకు నగరా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మే 14వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాలి. మే 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 31వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి.
జూన్ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఉప ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన అభ్యర్థి జనవరి 2, 2022 వరకు పదవిలో కొనసాగుతారు. స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 28, 2015లో వీటికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శంబీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్‌నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈఉప ఎనికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 2 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కొత్తగా ఎన్నికకాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఓటింగ్ అవకాశం ఉండదని అధికారవర్గాల సమాచారం.
టీఆర్‌ఎస్ నుంచి మహేందర్‌రెడ్డి..
స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచిమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం అధికారికంగా పట్నం మహేందర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ నాయకులుచెబుతున్నారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని, తప్పకుండాటీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా గెలుపొందితే జిల్లా రాజకీయాలపై ఆయన పట్టు మరింత పెరగనుంది.
కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువే..
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కోర్టును ఆశ్రయించే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీటికెట్ కోసం కాంగ్రెస్‌లోనూ ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నాయకులుఈ టికెట్‌ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్,మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితోపాటురంగారెడ్డి జిల్లాకు చెందిన కేఎల్‌ఆర్,రవియాదవ్ తదితరులు టికెట్ రేసులోఉన్నట్లు వినికిడి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపికపై త్వరలోనిర్ణయం తీసుకుంటామని రోహిత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment