స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని జిల్లాలో పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన ఆ పార్టీ.. ప్రాదేశిక ఎన్నికలతో పుంజుకోవాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. దీనికితోడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండటం కూడా తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఈ మార్పును జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు కమలం మార్క్ పెద్దగా లేదు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో కీసర, బంట్వారంలో తెలుగుదేశం పార్టీ పొత్తుతో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కంకణం కట్టుకుంది. జిల్లాలోని 21 జెడ్పీటీసీలు, 257 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో అన్ని స్థానాలు గెలిచే అవకాశం లేకపోయినా.. కనీసం అన్ని గ్రామాల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగేలా చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కనీసం ఐదు జెడ్పీటీసీ, 40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో జాతీయ నేతలు వచ్చినప్పటి నుంచి జిల్లాలో పార్టీ క్రమంగా బలపడుతోందని నేతలు చెబుతున్నారు.
టికెట్లు ఖరారు..
జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల ఒకరి పేరునే పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి. వీటిని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే.. దాదాపు 150కి పైగా అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. మిగిలిన స్థానాలకూ ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అరంజ్యోతికి అవకాశం?
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి సతీమణి అరంజ్యోతి పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు పార్టీ ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. చివరి నిమిషంలో ఎవరైనా ముందుకు వచ్చినా అరంజ్యోతి పక్కకు తప్పుకోవచ్చన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఇదే జరిగితే.. కందుకూరు జెడ్పీటీసీకి పార్టీ అధ్యక్షుడు
నర్సింహారెడ్డి పోటీచేసే
అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment