బండాకు అభినందనలు తెలుపుతున్న కంచర్ల, వేముల తదితరులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నార్కట్‌పల్లి జెడ్పీటీసీ ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఫలితం దోబూచులాడగా.. చివరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి 11 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్లను తిరిగి లెక్కించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో బండా నరేందర్ రెడ్డికి 16,722 ఓట్లు పోల్‌కాగా, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డికి .. 16,711 ఓట్లు వచ్చాయి. దీంతో 11 ఓట్ల మెజారిటీతో బండా విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీఆర్‌ఎస్ తమ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బండా నరేందర్‌రెడ్డిని నిర్ణయించింది. బహిరంగంగా ప్రకటించకున్నా.. పార్టీ శ్రేణులకు ఈ సమాచారం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలందరికీ తమ చైర్మన్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి అని వివరించింది.
దీంతో ఈస్థానంలో గెలుపు కోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచా రం చేశారు. నామినేషన్ దాఖలు రోజే సభ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ సైతం మండల కేంద్రంలో పర్యటించి వెళ్లారు. మొత్తం గా టీఆర్‌ఎస్ ఈ స్థానాన్ని కీలకంగా భా వించింది. అదే సమయంలో కాంగ్రెస్‌నుంచి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పోటీకి దిగారు. ఆయనను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీపీసీసీ ముందుగానే ప్రకటిం చింది. దీంతో ఈ స్థానంలో ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ రేపింది. మరో వైపు టీఆర్‌ఎస్ ముందు జాగ్రత్తగా.. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయం సింహారెడ్డిని పోటీకి పెట్టింది. నార్కట్‌పల్లిలో అనుకోనిది ఏదైనా జరిగి ప్రతి కూల ఫలితం వస్తే.. తిప్పనకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ కారణంగానే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధికారికంగా ఎవరి పేరును బహిరంగంగా ప్రకటించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇటు నార్కట్‌పల్లి, అటు మిర్యాలగూడ రెండు చోట్లా టీఆర్‌ఎస్ గెలిచింది.
బండా ఎన్నిక లాంఛనమేనా..?
నార్కట్‌పల్లి నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన బండా నరేందర్ రెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవడం లాంఛనమేనని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగంగా ఆయన పేరును చైర్మన్ పదవికి ప్రకటించక పోయినా.. ముందే నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఆయన అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఇలా, ప్రతీ ఎన్నికల సందర్భంలో ఆయన టికెట్ ఆశించడం, భంగపడడం ఆనవాయితీగా జరిగేది. చివరకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ లోగా జెడ్పీ ఎన్నికలు ఖరారు కావడంతో జెడ్పీ చైర్మన్ అవకాశం ఇవ్వడం కోసమే నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేయించారని పేర్కొంటున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌లో తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏకంగా 24 స్థానాలు గెలుచుకుంది. దీంతో తొలిసారి నల్లగొండ జెడ్పీపై గులాబీ జెండా ఎగరనుంది. బండా నరేందర్ రెడ్డి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నా.. మరోవైపు తనకూ అవకాశం వస్తుందని తిప్పన విజయసింహారెడ్డి ఆశాభావంతో ఉన్నారని చెబుతున్నారు.
సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయి
‘‘నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు ఎంపీ, ఎమ్మెల్యేలు. వారి కుటుంబ సభ్యులు వారు డబ్బులు ఖర్చు చేసి నన్ను ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. వాటన్నింటినీ ఎదురీది విజయం సాధించానంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపించాయి. నార్కట్‌పల్లి ప్రజలు వారి డబ్బులు లెక్క చేయకుండా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 జెడ్పీ చైర్మన్‌స్థానాలు టీఆర్‌ఎస్సే కైవసం చేసుకుంటుందని ముందుకు చెప్పిన విధంగానే విజయం సాధించాం. ’’ – బండా నరేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment