నేడే ఎంపీపీల ఎన్నిక | Today Telangana MPP Candidate Selection | Sakshi
Sakshi News home page

నేడే ఎంపీపీల ఎన్నిక

Published Fri, Jun 7 2019 9:25 AM | Last Updated on Fri, Jun 7 2019 9:25 AM

Today Telangana MPP Candidate Selection - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : మండల అధ్యక్షుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ఆయా మండలాల్లో జరగనుంది. ఇప్పటికే మండల ప్రాదేశిక  నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 134 స్థానాలకు పరిమితమైంది. అయితే, మండల అధ్యక్ష పదవుల విషయానికి వస్తే.. టీఆర్‌ఎస్‌ ఖాతాల్లో 18 మండలాలు చేరనున్నాయి. మరో ఆరు మండలాల్లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కొలువు దీరనున్నారు. ఇంకో ఏడు మండలాల్లో  మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఈ మండలాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యుల పాత్ర కీలకం కానుంది.

జిల్లాలో 31 మండలాల్లో ఎంపీపీ పదవుల కోసం ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ల్లో గెలిచిన మొత్తం సభ్యుల్లో పార్టీలు నిర్ణయించిన 62మంది మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా శుక్రవారం ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా ఉదయం 10 గంటల వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీని ఎన్నుకోనున్నారు. ముందుగా  కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగే కార్యాలయాలకు వంద మీటర్ల దూరం వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేíశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా అటు అధికార టీఆర్‌ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆయా పార్టీలతో పొత్తులకు వెళ్లాయి. అయితే.. టీఆర్‌ఎస్‌ ఏ పార్టీ సహకారం లేకుండానే ఏకంగా 18 మండలాల్లో అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకునే మెజారిటీని సాధించింది. ఆరు మండలాల్లో కాంగ్రెస్‌కు ఇదే స్థితి ఉంది. మిగిలిన ఏడు మండలాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరే మండలాలే ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

ఆ.. ఏడు చోట్ల ఉత్కంఠ!

  • ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పెద్దవూర, వేములపల్లి, తిప్పర్తి, చండూరు, చిట్యాల , నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులు అవుతారో..? విధిలేని పరిస్థితిలో మద్దతు తెలిపే వారే ఏకంగా పదవిని దక్కించుకుంటారో అన్న చర్చ జరుగుతోంది.
  • వేములపల్లి మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను ఉన్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని దక్కించుకోవాలంటే నాలుగు ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. కానీ, టీఆర్‌ఎస్‌ తరఫున ముగ్గురు సభ్యులు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు విజయం సాధించారు. మరో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవాలంటే ఇండిపెండెంట్‌ ఒక్కరు మద్దతిస్తే  చాలు. అదే కాంగ్రెస్‌ కైతే.. సీపీఎంతో పాటు, ఇండిపెండెంట్‌.. అంటే ఇద్దరి మద్దతు అవసరం ఉంది. 
  • పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 5 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో ఇండిపెండెంట్‌ గెలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఎవరు అధ్యక్షుడు కావాలన్నా, ఆ ఇండిపెండెంట్‌ మద్దతు తప్పని సరి.
  • తిప్పర్తి మండంలోనూ ఇదే సీన్‌. ఇక్కడ 9 ఎంపీటీసీ స్థానాలుంటే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 4 చోట్ల గెలిచాయి. ఒక ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. ఆ ఇండిపెండెంట్‌ మద్దతు ఎవరికి దక్కింతే ఆ పార్టీకి మండల అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉంది.
  • చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలు గెలిచిన పార్టీకి మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, కాంగ్రెస్‌ 5 స్థానాలను గెలుచుకున్నా.. మరో సభ్యుడి కొరత ఏర్పడింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ 4 ఎంపీటీసీ స్థానాలను గెలచుకుంది. కాగా, సీపీఐ, బీజేపీలు చెరో స్థానంలో గెలిచాయి. ఈ రెండు పార్టీల్లో ఒకరు మద్దతిస్తే కాంగ్రెస్‌కు మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. అదే టీఆర్‌ఎస్‌కు అవకాశం రావాలంటే.. సీపీఐ, బీజేపీ రెండూ మద్దతివ్వాల్సి ఉంటుంది. 
  • నకిరేకల్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా మూడు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిట్యాల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను.. ఏడు స్థానాలు వచ్చిన పార్టీకి మండలం దక్కేది. కానీ, టీఆర్‌ఎస్‌ 6 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. మరొక్క సభ్యుడి మద్ధతు లభిస్తే చాలు. కాగా, ఈ మండలంలో కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం ఒక చోట గెలిచింది. మరో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, స్వంతంత్రులు ముగ్గురు కలిసినా అవకాశ దక్కే చాన్సులేదు. దీంతో ఒక సభ్యుడిని తమ వైపు తిప్పుకోగలితే చిట్యాల టీఆర్‌ఎస్‌ సొంతం అవుతుంది. గెలిచిన ముగ్గురు స్వతంత్రుల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఉన్నారని, వారి మద్ధతు తమ పార్టీకే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
  • నకిరేకల్‌లో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఏ పార్టీకైనా ఐదు స్థానాలు గెలిస్తే మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, టీఆర్‌ఎస్‌ 4 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. 3చోట్ల కాంగ్రెస్‌ గెలిస్తే.. స్వతంత్రులు మరో ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వారే కీలకంగా మారారు. వీరిలో కూడా టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఉన్నారని చెబుతున్నందున.. ఇక్కడా టీఆర్‌ఎస్‌కే అవకాశం ఉందంటున్నారు. 
  • కేతేపల్లి మండలంలో 11 స్థానాలకు గాను ఆరు సీట్లు గెలుచుకుంటే.. ఎంపీపీ పదవి దక్కుతుంది. కానీ, టీఆర్‌ఎస్‌కు కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్‌ నాలుగు చోట్ల , మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. టీఆర్‌ఎస్‌కు ఒక్కరు మద్ధతిస్తే సరిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు అవకాశం దక్కాలంటే ఇండిపెండెంట్లు ఇద్దరూ మద్దతివ్వాలి. మొత్తంగా ఈ ఏడు చోట్లా ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు చోట్ల అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement