సాక్షి, కొత్తగూడెం: పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లాలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. జిల్లా ప్రజాపరిషత్ విషయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 21 జెడ్పీటీసీలకు గాను 16 గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో ఎన్నికలకు ముందే స్పష్టత వచ్చింది. టేకులపల్లి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన కోరం కనకయ్య పేరును ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించింది. ఇక కనకయ్య ఆ పీఠం ఎక్కడం లాంఛనమే. అయితే జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. ఇందుకు కొంతమేర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను జిల్లా ఇన్‌చార్జి(జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కోసం)గా ఉన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు బుధవారం తీసుకెళ్లారు. అయితే పినపాక నియోజకవర్గంలో మొత్తం 7 జెడ్పీటీసీలకు గాను టీఆర్‌ఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. గుండాల జెడ్పీటీసీని న్యూడెమోక్రసీ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు సభ్యులను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం రాత్రే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునేవారెవరనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముందంజలో కంచర్ల...
చుంచుపల్లి నుంచి జెడ్పీటీసీగా గెలిచిన కంచర్ల చంద్రశేఖర్‌రావు వైస్ చైర్మన్ పీఠం రేసులో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందే రెండుసార్లు టీఆర్‌ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. ఈ నేపథ్యంలో కంచర్లకు నేరుగా కేసీఆర్‌తోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. కంచర్లకు అవకాశం దక్కనుందని కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో దమ్మపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన పైడి వెంకటేశ్వరరావు రేసులోకి వచ్చారు. ఆది నుంచి తుమ్మలకు ముఖ్య అనుచరుడిగా ఉన్న పైడి.. తనకు అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడి నుంచి వైస్ చైర్మన్ ఉంటే పార్టీకి మరింత మేలు కలుగుతుందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తుమ్మల సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మణుగూరు నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన పోశం నర్సింహారావు సైతం వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఆయనకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మద్దతు ఉంది. రేగా వ్యూహంతో నియోజకవర్గంలో గుండాల మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు భారీ మెజారిటీతో గెలుపొందారు. పైగా రేగాకు టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో పోశం ప్రయత్నాలు సైతం గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ వైస్ చైర్మన్ పీఠం కోసం త్రిముఖ పోటీ ఉండడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
కొన్ని మండల పరిషత్‌లలో అస్పష్టత..
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం విషయమై కచ్చితమైన స్పష్టత ఉండగా, వైస్ చైర్మన్ విషయమై ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు కొన్ని మండల ప్రజాపరిషత్‌ల విషయంలోనూ అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించక తప్పడం లేదు. చర్ల మండలంలో కాంగ్రెస్, సీపీఎం కూటమికి, దుమ్ముగూడెంలో సీపీఎం, సీపీఐ కూటమికి మెజారిటీ ఉంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది. అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉంది. అన్నపురెడ్డిపల్లి మండలంలో 6 ఎంపీటీసీలకు గాను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ లకు చెరో మూడు దక్కాయి. ఇక ములకలపల్లి మండలంలో ఏ పార్టీకీ తగినన్ని సీట్లు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కింది. బూర్గంపాడు మండలంలో ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగలేదు. గుండాల మండలంలో న్యూడెమోక్రసీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఆళ్లపల్లి మండలంలో టీఆర్‌ఎస్‌కు రెండు, కాంగ్రెస్‌కు ఒకటి, సీపీఐకి ఒకటి వచ్చాయి. జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టీఆర్‌ఎస్‌కు కేవలం ఒక్క ఎంపీటీసీ అవసరం ఉంది. ఈ మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. సుజాతనగర్ మండలంలో మాత్రం రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తున్నారు.
రేసులో ముగ్గురు..
Published Thu, Jun 6 2019 7:05 AM | Last Updated on Thu, Jun 6 2019 7:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment