సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది. ఫలితాలు వెలువడ్డాక.. గెలిచిన సభ్యులను ఎలా కాపాడుకోవాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? చేతులెత్తే పద్ధతిన జరిగే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులనెలా కైవశం చేసుకోవాలి.. మెజారిటీ బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వల వేయాలి? ఏమేం ఎర వేయాలి? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. నేటి సాయంత్రానికల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 71 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం మండలాల్లో.. గ్రామాల్లో కొలువుదీరే విజేతలెవరో తేలిపోనుంది. అలాగే ఈనెల 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ల ఎంపికకు ముహూర్తమూ ఖరారైంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీ చైర్మన్ గిరీలతో పాటు ఎంపీపీ పీఠాలు ఎవరు కైవసం చేసుకుంటారో అనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది.
క్యాంపునకు తరలించే యోచన
ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా వారిని క్యాంపులకు తరలించే యోచనలో పార్టీలున్నాయి. సాధారణంగా అన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడి ఎంపీపీ.. జెడ్పీ చైర్మన్, చైర్‌పర్సన్ పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. కానీ అనిశ్చిత బలబలాలతో హంగ్ లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితమే. ఒకటీ రెండు ఓట్లు తారుమారైతే.. ఎవరైనా లోపాయకారీగా ప్రత్యర్థి పార్టీలకు మొగ్గు చూపితే.. ఎన్నిక జరిగే సమయానికి ఎవరైనా గైర్హాజరైనా.. ఫలితం తారుమారయ్యే పరిస్థితి నెలకొంటుంది. గెలిచే మేజిక్ ఫిగర్‌కు ఒక ఓటు అటు ఇటయినా.. ఫలితం చేజారిపోవటం ఖాయం. అందుకే ప్రధాన పార్టీలతోపాటు చైర్మన్ గిరీ రేసులో ఉన్న అభ్యర్థులకు రాబోయే ఎన్నిక సవాలుగా మారుతుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావటంతో విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే తమకున్న బలగాన్ని చైర్మన్ ఎన్నిక జరిగే వరకు భద్రంగా కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ సభ్యులతో పాటు అవసరమైన ఓట్ల మేరకు మిగతా వారితో బేరసారాలాడి ఎన్నిక నాటి వరకు ఎక్కడికైనా తరలించే క్యాంపు రాజకీయాలపై దృషి సారించాయి.
ఫలితాలు వెలువడిన వెంటనే బేరసారాలు చేసుకుని రహస్యంగా శిబిరాలకు తరలించేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. మండలాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మరింత జోరుగా సాగే అవకాశముంది. అన్నిచోట్ల ఎంపీటీసీలుగా గెలిచే సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎంపీపీ పదవులను తమ వశం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కాచుక్కూచున్నారు. అందుకే ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపీటీసీ సభ్యులను విహారయాత్రల పేరుతో క్యాంపులకు తీసుకెళ్లే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో సమావేశాల పేరిట గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని ఒక ప్రధాన పార్టీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీ సభ్యులు క్యాంపుల దారి పట్టకుండా ఉండేందుకు విప్ జారీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పదవిని అందుకోవాలని ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు తమ శక్తియుక్తులతోపాటు డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధపడగా.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఎక్కువ ఎంపీపీ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుండటంతో క్యాంపులు ఎన్ని రూట్లు మారుతాయోననే చర్చ జరుగుతోంది.
రంగంలో ఇన్‌చార్జ్‌లు
ప్రాదేశిక ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందిన అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అన్ని పార్టీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఇన్‌చార్జీగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నియమించారు. అలాగే జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఇటు కాంగ్రెస్ సైతం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు మల్లు రవిని, వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి చిన్నారెడ్డిని, జోగుళాంబ గద్వాలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియమించింది. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు క్యాంపులకు తరలివెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment