ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన సమయంలో భగ్గుమ న్న అసమ్మతి నేతలు.. రోజులు గడుస్తున్న కొద్దీ మెత్తబడుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో పునరాలోచనలో పడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చి అసెంబ్లీని రద్దు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేసిన వెంటనే ఎల్లారెడ్డి, బాల్కొండ నియోజకవర్గాల్లో అసమ్మతి తెరపైకి వచ్చింది. మిగిలిన చోట్ల మాత్రం అంతర్గతంగా రగులుకుంటోంది.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని తిరిగి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ అసమ్మతిరాగం ఆలపించారు. అప్రమత్తమైన రవీందర్‌రెడ్డి జనార్దన్‌గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరగా.. ఆశించిన స్పందన కరువైంది. దీంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి గెలుపునకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ చెప్పడంతో జనార్దన్‌గౌడ్ అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బాల్కొండలో..
బాల్కొండ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన అసమ్మతి సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ ఖరారు చేయడంతో ఆ నియోజకవర్గంలోని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునిల్‌రెడ్డి అసమ్మతి గళం వినిపించారు. తన అనుచరులతో వేల్పూర్ మండలంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనుచరుడైన సునిల్‌రెడ్డి ఈసారి బీఎస్పీ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అసమ్మతి నేత బరిలో ఉంటే పరోక్షంగా ప్రశాంత్‌రెడ్డికి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే కాస్త వ్యతిరేక ఓట్లు చీలిపోయి, పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లోనూ..
కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. కానీ బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దాదాపు ఖరారైనట్లే. ఆర్మూర్‌లో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆకుల లలితకు అధినాయకత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరారైన ఈ మూడు స్థానాల్లో రెండుచోట్ల అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కామారెడ్డిలో ఆ పార్టీ పీసీసీ కార్యదర్శి నల్లవెల్లి అశోక్ అసమ్మతి రాగం వినిపించారు. తన పేరును కూడా పరిశీలించాలని పీసీసీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అసమ్మతి నేతను బుజ్జగించేందుకు షబ్బీర్‌అలీ అశోక్‌తో మాట్లాడారు. విభేదాలను పక్కన బెట్టి ఎన్నికల్లో సహకరించాలని కోరారు.
ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కారెక్కడంతో ఇక్కడ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం కలిసొచ్చింది. టీపీసీసీ అధినాయకత్వం కూడా ఆకుల లలితకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆకుల లలిత అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలుండడంతో ఇక్కడ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సురేశ్‌రెడ్డి అనుచరుడిగా పనిచేసిన మార చంద్రమోహన్ అసమ్మతి రాగం అందుకున్నారు.
అలాగే కాంగ్రెస్‌లో చేరిన రాజారాం యాదవ్ సైతం అసమ్మతిని తెలియజేశారు. ఆర్మూర్‌లో ఈ నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇప్పటికే ఓ కొలిక్కి వస్తుండగా, ఎన్నికల సమయం నాటికి అసమ్మతి సెగలు పూర్తిగా చల్లారుతాయని ఆయా పార్టీల వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment