మీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. మళ్లీ గెలుస్తాడా..? కాంగ్రెస్ నేతలపై మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ సర్వే బృందాలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి. సర్వేలు జరుగుతున్నట్లు ఆయా పార్టీల నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండడంతో ప్రజల మనసులో తమపై అభిప్రాయం ఎలా ఉందోనని హైరానా పడుతున్నారు.
సాక్షి, యాదాద్రి : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీలు సర్వేలపై ఎక్కువ మక్కువ చూపుతున్నాయి. అభ్యర్థులు, ఆశావహులు సైతం సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలను పోల్చుకుంటూనే ఎవరికి వారు తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో టీఆ ర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తోపాటు మరి కొన్ని పార్టీలు బరిలో నిల్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ గెలుపు అవకాశాలు ఎలా ఉంటా యోనని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పనితీరు, పోటీల్లో ఉండే అభ్యర్థుల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి.
టీఆర్‌ఎస్ మరోసారి సర్వే..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని సిట్టింగ్‌లం దరికీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్లు కేటాయించిన అభ్యర్థులపై మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక ఏజెన్సీతోపాటు ప్రభు త్వ నిఘా సంస్థల ద్వారా సర్వే చేపట్టారు. గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలనుంచి పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరు, వారి వల్ల జయాపజయాలపై ఉండే ప్రభావాన్ని సర్వేలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు, పార్టీ, అభ్యర్థి వ్యతిరేకల ప్రభావం ఎలా ఉంటుంది తిరుగుబా టు అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా, వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశాలపై సర్వే కొనసాగుతోంది. సీఎం తాజా పరిస్థితులపై చేపట్టిన ఈసర్వే అభ్యర్థుల్లో కొంత గుబులు రేకెత్తిస్తుంది.
హస్తం నేతల్లోనూ ఆందోళన
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. డీసీసీ, టీపీసీసీ ద్వా రా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే వీరిపై షార్ట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థిని రంగంలో దించితే గెలుపు సాధ్యమవుతుంది, ఆశావహుల్లో ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆదరణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు సర్వేలు చేయించింది. తా జాగా మరో సర్వే చేస్తోంది. ఈసర్వేను అభ్యర్థుల ఎంపికకు కొంత ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ నుంచి ఢిల్లీ దాకా ఆశావహులు టికెట్‌ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఆశావహుల వ్యక్తిగత సర్వేలు
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధినాయకత్వం చేయిస్తున్న సర్వేలతో పాటు ఆశావహులు, అభ్యర్థులు కూడా తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేల ఫలితాలను పోల్చి చూసుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఏది ఏమైనా జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు ప్రధాన ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే ఆశావహుల వరకు సర్వే అంటే ఆసక్తి చూపుతున్నారు. సర్వే కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూ తమ బలం, బలహీనతలతోపాటు ఎదుటి పార్టీల బలబలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment