డోకూరు గ్రామస్తులతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు (ఫైల్)
మహబూబ్‌నగర్ క్రైం: ప్రశాంతంగా ఉండే పాలమూరులో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి.. స్థానిక ఎన్నికలు అంటేనే ప్రధానంగా వర్గపోరు.. గ్రామాల్లో రెండు వర్గాలకు మధ్య పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇలాంటి ఎన్నికల సమయాల్లో దాడులకు పాల్పడుతుంటారు. పల్లెలో ఎప్పుడూ కూడా ఎన్నికలు వ్యక్తిగతంగా.. కుటుంబాల మధ్య నడుస్తుంటాయి. ఈ క్రమంలో ఏళ్ల నుంచి పడని కుటుంబాలు ఉంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఇందులో ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ప్రకటించిన తర్వాత పలు గ్రామాల్లో విజేతలు ర్యాలీలు చేపడుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య దాడులు జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ర్యాలీల్లో రాజుకున్న నిప్పు
దేవరకద్ర మండలం డోకూర్‌లో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచిన ఆనందంలో ర్యాలీ చేస్తున్న క్రమంలో మరో పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్‌ను కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు. అలాగే మహబూబ్‌నగర్ మండలంలోని రామచంద్రపూర్‌లో ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ సమయంలో ఓ కిరాణదుకాణం దగ్గర ఉన్న అశోక్‌చారి అనే యువకుడిపై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘర్షణలో అనసూయ అనే మహిళపై కూడా దాడి చేయడంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్దూరు మండలం రెనివట్ల ఎంపీటీసీ కారుపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. ఇటు పోలీసులతోపాటు అటు రాజకీయ నేతలను కలవరపెట్టింది.
పోలీసులు దృష్టి పెట్టాలి
భూ వివాదాలు, అదనపు కట్నం, ప్రేమ వివాహాల విషయం చాలా వరకు ముందే గ్రామ పోలీస్ అధికారులు, ఫిర్యాదుల రూపంలో పోలీసులకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ చిన్న విషయాలుగా భావిస్తూ పోలీసులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులు, రక్షణ లేదనుకునే వారు పోలీసులను ఆశ్రయించినప్పు డు మీరే పరిష్కరించుకోవాలని సూచిస్తూ వదిలేస్తున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిని ఠాణాకు పిలిపించి హె చ్చరించడం.. వారి కదలికలపై నిఘా వేసి ఉంచి తే పరిస్థితి చేయిదాటేది కాదు. గతంలో కేసులు నమోదైన వారు, రౌడీషీటర్లపై నిఘా ఉంచినట్లే గ్రామాల్లో విచ్చలవిడిగా వ్యవహరించే వారు, ఆరోపణలున్న వ్యక్తులపైనా దృష్టిపెడితే ఈ హత్యకాండలకు అడ్డుకట్ట వేసే వీలుంటుంది.
పథకం ప్రకారమే..
ఇటీవల చోటుచేసుకున్న హత్యల్లో క్షణికావేశంలో చోటుచేసుకున్నవి తక్కువే. పక్కా హత్యలు చేసినవే ఎక్కువ. సాధారణంగా ఎదుటి వారిని భయబ్రాంతులకు గురి చేసేందుకు మూకుమ్మడిగా దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతాయి. కానీ ఇటీవల హత్యలు చేసిన వారు కిరాయి హంతకుల్లా ప్రణాళిక ప్రకారం దాడులు చేసి క్రూరమైన రీతిలో ప్రాణాలు తీశారు.
బాధిత కుటుంబాలకు బెదిరింపులు
మరోదిక్కు హత్యలు చోటుచేసుకున్న తర్వాత హంతకులు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబ సభ్యలను బెదిరించి రాజీ చేసుకుంటున్నారు. స్థానికంగా పైరవీలకు పాల్పడుతున్న నాయకులు, కొందరు దళారులు పోయిన వ్యక్తి ఎలాగూ పోయాడు.. వారు ఇచ్చేది తీసుకొని రాజీ చేసుకోండి.. లేకుంటే మీకే ప్రమాదం అంటూ బాధిత కుటుంబాలను రాజీకి ఒప్పిస్తున్నారు. పోలీ సులు హత్య కేసులు త్వరగా ఛేదించి.. బాధి త కుటుంబాలకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా చూడవచ్చు.
పంతం నెగ్గడమే ముఖ్యం..
భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకం, లావాదేవీల్లో తేడాలు కూర్చొని మా ట్లాడుకొని పరిష్కరించే వీలున్నవే కానీ ఆ దిశ గా చేస్తున్న వారు తక్కువవుతున్నారు. వివాదా లు పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రతీసారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఘర్ష ణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మధ్యవర్తులుగా ఉన్న వారు, నమ్మి చర్చలకు కూర్చున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న హత్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. హత్యలు చేస్తే చట్టానికి చిక్కుతామని తెలిసినా.. కఠిన శిక్షలు పడతాయనే అవగాహన ఉన్నా వారిలోనూ భయం కనిపించడం లేదు. తమ మాట నెగ్గాలనే మొండితనం, చట్టాలపై ఉన్న చిన్నచూపు ఇందుకు కారణం.
జిల్లాలో అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను పోలీసులు చాలా ప్రశాంతంగా నిర్వహించారు. అదే తరహాలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని అవసరం ప్రణాళికలు వేసుకొని విజయవంతంగా ముగించారు. కానీ, ఓట్ల లెక్కింపు తర్వాత గ్రామాల్లో జరిగే ర్యాలీలపై ప్రత్యేక దృష్టి.. అవసరమైన నిఘా ఏర్పాటు చేయకపోవడంతో హత్యలు, దాడులకు దారితీసింది. ఈ క్రమంలోనే డోకూర్, రామచంద్రపూర్ గ్రామాల్లో జరిగిన ఘటనలు ఒక్కసారిగా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment