సాక్షి, మెదక్: అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు రాజకీయ వేడి రాజుకుంటోంది. మరోపక్క సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కాక పుట్టిస్తోంటే.. ప్రజల్లో అవే చర్చనీయాంశాలవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మెతుకుసీమ ‘నువ్వా.. నేనా?’ అంటూ నాయకులు విసురుకుంటున్న సవాళ్లతో కుతకుతలాడుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నడుమ వార్ మొదలైంది. ఎన్నికల ప్రచారాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. అంతటితో ఆగకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్, ట్విట్టర్, ఫేష్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు వీటికి ధీటుగా స్పందిస్తూ ఎన్నికల పోరుకు సై అంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది.
ప్రారంభించిన సునీతారెడ్డి ప్రచారం
శాసనసభ రద్దు మొదలు జిల్లాలో రాజకీయ వాతావరణం చోటు చేసుకుంది. రద్దు చేసిన వెనువెంటనే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మెదక్, నర్సాపూర్ స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు టీఆర్‌ఎస్ అధిష్టానం కట్టబెట్టింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుంటున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ప్రచార సభను నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్ నుంచి టికెట్ రావటం ఖాయం కావటంతో మాజీ మంత్రి సునీతారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మెదక్ నియోకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ఆశావహులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, చంద్రపాల్ తదితరులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్లు...
నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన ప్రచారసభలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలకు దిగారు. సునీతారెడ్డి మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, నీటిపారుదలశాఖా మంత్రిగా ఉంటూ ఒక్క చెరువులో çకూడా పూడికతీయించలేదంటూ ఆమెపై దాడికి దిగారు. కాగా మంత్రి సునీతారెడ్డి రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం, పత్రికాముఖంగా టీఆర్‌ఎస్‌కు సవాలు విసిరారు. తాను మంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని దమ్ముంటే టీఆర్‌ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మంత్రి సవాల్‌పై టీఆర్‌ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సైతం పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు.
మెదక్‌లో టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్
మెదక్ నియోజకవర్గలో సైతం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తలపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలకు దిగడంతోపాటు ఇటీవల హవేళిఘనపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై టీఆర్‌ఎస్ మండిపడుతూనే కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో తూర్పారబట్టే ప్రయత్నం చేస్తోంది. మంగళవారం పాపన్నపేట మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, బతుకమ్మ.. బోనాలకు పరిమితమైదంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం రామాయంపేటలో స్పందించారు. కాంగ్రెస్ నేతలు బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిని కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి ప్రజలకు తెలుసని.. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. మెదక్ ప్రజలు ఆపార్టీనిపై తిరగబటం ఖాయమన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వేదికగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తలపడుతూ ఒకరిపార్టీపై మరొకరు బురదజల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment