సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా, జిల్లాలో తొలి రోజు కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది. నామినేషన్ పత్రాలను మాత్రం పదుల సంఖ్యలో సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు తీసుకెళ్లారు. ముహూర్త బలాన్ని చూసుకున్న తర్వాతే నామినేషన్ దాఖలు చేసేందుకు మెజారిటీ అభ్యర్థులు, ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు నామినేషన్ తొలి సెట్‌ను సాదాసీదాగా దాఖలు చేసి, ముహ్తూరం కుదిరిన రోజు భారీ హంగామాతో తరలివెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు కాగా, 14 నుంచి నామినేషన్ల దాఖలు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ల స్వీకరణకు వీలుగా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వంద మీటర్ల దూరం నుంచి బారికేడ్లు నిర్మించి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల తరపున 42 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు జారీ చేశాయి. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మంతపురి బాలయ్య ఒక్కరే తొలిరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి 15 సెట్ల నామినేషన్ ఫారాలు జారీ చేయగా, జహీరాబాద్‌లో నలుగురు అభ్యర్థులు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా మంది అభ్యర్థులు ముహూర్త బలాన్ని చూసుకున్న తర్వాతే నామినేషన్ దాఖలు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఎలాంటి హడావుడి లేకుండా దాఖలు చేసి, ముహూర్తం కుదిరిన రోజు భారీ హంగామాతో నామినేషన్లు దాఖలు వేయాలనే యోచనలో ఉన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీలు, రోడ్‌షోల ద్వారా బల ప్రదర్శన చేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ దాఖలుకు సంబంధించి ర్యాలీకి అనుమతి కోరుతూ ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి దరఖాస్తులు అందుతున్నాయి.
కూటమిలో కొనసాగుతున్న ప్రతిష్టంభన
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా మహాకూటమి భాగస్వామి పార్టీల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రి య కొలిక్కి రావడం లేదు. జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఉన్నా కాంగ్రెస్ జాబితా విడుదల కావడం లేదు. దీంతో నామినేషన్ల దాఖలుపై మహా కూట మి నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో స్పష్టత కొరవడింది. టీడీపీ, కాంగ్రెస్ నడుమ ఏకాభిప్రాయం కుదరక పటాన్‌చెరు, కాంగ్రెస్‌లో అంతర్గత పోరుతో నారాయణఖేడ్ అభ్యర్థుల ప్రకటనపై మహాకూటమిలో పీటముడి పడింది.
మరోవైపు బీజేపీలో కూడా అందోలు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడంతో నామినేషన్ల దాఖలు సందడి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పలువురు ఔత్సాహికులు స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపుతూ సన్నాహాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు కూడా పంపిణీ కావడంతో ముహ్తూరం చూసుకుని నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment