పొత్తు.. గల్లంతు | Congress MLA Candidate Muthyam Reddy Join In TRS Medak | Sakshi
Sakshi News home page

పొత్తు.. గల్లంతు

Published Fri, Nov 23 2018 1:03 PM | Last Updated on Fri, Nov 23 2018 1:03 PM

Congress MLA Candidate Muthyam Reddy Join In TRS Medak - Sakshi

ప్రవీణ్‌రెడ్డి , కంటతడి పెడుతున్న ముత్యంరెడ్డి (ఫైల్‌)

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టయ్యింది... జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పొత్తులు, సీట్ల కేటాయింపులు జిల్లా కాంగ్రెస్‌ పార్టీని కుదిపేశాయి. ఫలితంగా సీనియర్‌ నాయకుడు ముత్యం రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని కంటతడి పెట్టి గులాబీ గూటికి చేరగా.. మరో నాయకుడు ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్‌ టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోటీ నుండి అనివార్యంగా నిష్క్రమించాల్సిన దుస్థితి నెలకొంది. పార్టీలో సీనియర్‌ నాయకులకు జరిగిన అవమానాన్ని తలచుకుని రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంగ్రెస్‌లో ఉన్న జూనియర్‌ నాయకులు అయోమయంలో పడ్డారు.

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ టికెట్‌ వస్తుందని గత యాభై రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో గ్రామగ్రామాన మాజీ మంత్రి ముత్యం రెడ్డి ప్రచారం చేశారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించి, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకున్న పెద్దాయనకు చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో తీవ్రంగా కలత చెందారు. తనను పరామర్శించడానికి ఇంటికొచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ముందు కంట తడి పెట్టారు. పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ముత్యం రెడ్డి వంటి వారే బోరున విలపించడంతో కార్యకర్తలు నివ్వెరపోయారు. నియోజకవర్గంలో కొందరు ముత్యం రెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ గూటికి చేరగా.. మరికొందరు కాంగ్రెస్‌లో ఉండి ముందుకు నడవలేక.. అలాగని టీఆర్‌ఎస్‌లో చేరలేక సంకట స్థితిలో ఉన్నారు. ముత్యం రెడ్డి కేడర్‌ ఆయనతోనే ఉందని, మంగళవారం సిద్దిపేటలో జరిగిన సీఎం సభకు దుబ్బాక నియోజకవర్గం నుండి ముత్యం రెడ్డి అనుచరులు వేలాదిగా తరలి వచ్చారని ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ బీ ఫారం తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి ఎంతమాత్రం రాణిస్తారో వేచి చూడాల్సిందే.

స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని కోల్పోయిన ప్రవీణ్‌రెడ్డి 
జిల్లాలోని మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హుస్నాబాద్‌కు చెందిన ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ సీట్ల పంపకాల్లో హుస్నాబాద్‌ సీటును సీపీఐకి కేటాయించింది. అయితే రాష్ట్రంలో టీజేఎస్‌కు కేటాయించిన సీట్లలో మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ బీ ఫారాలు కూడా ఇచ్చారు. తనకు కూడా ఇస్తారనే ధీమాతో ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. గుర్తింపు పొందిన పార్టీ నుండి నామినేషన్‌ వేస్తుండటంతో నామినేషన్‌కు ఒక్కరు మాత్రమే ప్రతిపాదించారు.

అయితే తీరా సమయానికి బీ ఫారం రాకపోవడంతో ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో అనివార్యంగా ప్రవీణ్‌రెడ్డి పోటీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ బీ ఫారం ఇస్తుందనే నమ్మకంతో మోసపోయానని, మోసం చేస్తుందని అనుకుంటే స్వతంత్రంగా పోటీలో ఉండేవాడినని ప్రవీణ్‌రెడ్డి తన అనుచరులతో చెప్పి వాపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో ప్రవీణ్‌రెడ్డి ఆయన అనుచరులు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డికి మద్దతు తెలుపుతారా..లేదా అనేది కూడా నియోకవర్గంలో చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement