హుస్నాబాద్‌లో వెనక్కి తగ్గేది లేదు: సీపీఐ | Grand Alliance Candidates Not Understanding ,Not Friendly | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌లో వెనక్కి తగ్గేది లేదు: సీపీఐ

Published Fri, Nov 16 2018 9:10 AM | Last Updated on Fri, Nov 16 2018 1:12 PM

Grand Alliance Candidates Not Understanding ,Not Friendly - Sakshi

టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న కూటమి లక్ష్యం రోజురోజుకూ నీరుగారిపోతోంది. మహాకూటమిలోని పార్టీలకు సమన్వయం కుదరకపోవడంతో ఎవరికివారే నామినేషన్లు వేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు పొందిన పార్టీలకు ఇతర పార్టీల వారు సహకరించడం లేదు. కేసీఆర్‌ను మరోసారి సీఎం కాకుండా అడ్డుకుంటామని కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో వాతావరణం ఏమంత సానుకూలంగా కనిపించడం లేదు. జిల్లాలోని నాలుగింట మూడు చోట్ల ఆశావహులు తలనొప్పిగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొనడం ఏమంత సులువు కాదని కాంగ్రెస్‌ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, సిద్దిపేట :  మహాకూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు.. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కూటమి ఏర్పాటుకు మూలస్థంభమైన తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మొదటి నుండి సిద్దిపేట జిల్లాలోని రెండు సీట్లపై కన్నేశారు. ఆ దిశగానే దుబ్బాక, సిద్దిపేట టికెట్లు కూటమికే కేటాయించాలని పట్టుబట్టారు. చివరకు సాధించారు. ఇప్పటి వరకు టీజేఎస్‌కు ఆరు స్థానాలు కేటాయించగా అందులో రెండు స్థానాలైన దుబ్బాక, సిద్దిపేట పేర్లు ఉన్నాయి.

అయితే దుబ్బాకలో టీజేఎస్‌ అభ్యర్థిగా చిన్నం రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా భవానీ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలు టీజేఎస్‌కు కేటాయించినా.. తామూ బరిలో ఉంటామని దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి బుధవారం నామినేషన్‌ వేశారు. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ టికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. తాను ఏం తప్పు చేశానని పార్టీ నాకు టికెట్‌ ఇవ్వడంలేదని కార్యకర్తలు, ప్రజల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా... ఈసారి పోటీలో ఉండటం మాత్రం తథ్యమని, పార్టీ అధిష్టానం మనస్సు మార్చుకొని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటిస్తే సరే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీలో ఉండి తన సత్తా రుజువు చేసుకుంటానని సవాల్‌ విసురుతున్నారు.  

సిద్దిపేట బరిలో కాంగ్రెస్‌ రెబల్స్‌
సిద్దిపేట సీటును టీజేఎస్‌కు ఎలా కేటాయిస్తారని కాంగ్రెస్‌ నాయకులు అధిస్టానాన్ని  విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌ ఇప్పటికే ఒక సెట్‌ కాంగ్రెస్‌ నుండి మరోసెట్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అదేవిధంగా దరిపల్లి చంద్రం కాంగ్రెస్‌ అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రజావేదన ర్యాలీ తీశారు. గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌ వర్మ సిద్దిపేట టికెట్‌ టీజేఎస్‌కు కేటాయించడం సరికాదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. అదేవిధంగా సిద్దిపేట టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌ కూడా నామినేషన్‌ వేయడం విశేషం. 

సర్దుకుంటామంటున్న నాయకులు 
పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించిన దుబ్బాక, సిద్దిపేటల్లో కాంగ్రెస్‌ నాయకులు కూడా పోటాపోటీగా నామినేషన్లు వేయడంపై టీజేఎస్‌ నాయకలు కలవరపడుతున్నారు. అయితే టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాత్రం నిర్భయంగా ప్రచారం చేసుకోండి అని ఆదేశించారని దుబ్బాక అభ్యర్థి రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా చెప్పుకునే భవానీరెడ్డిలు అంటున్నారు.  టికెట్‌ రాలేదనే ఆవేదన ఉంటుందని, అయితే నామినేషన్ల విత్‌డ్రా నాటికి అంతా సర్దుకుటుందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి కట్టుగా కూటమి గెలుపు కోసం పాటు పడతారని చెబుతున్నారు. హుస్నాబాద్‌లో కూడా సీపీఐ అభ్యర్థే కూటమి అభ్యర్థిగా ఉంటారని, కాంగ్రెస్, టీడీపీ మా అభ్యర్థి గెలుపు కోసం పాటు పడుతారని సీపీఐ నాయకులు చెప్పుకుంటున్నారు.  

హుస్నాబాద్‌లో ఒడవని గొడవ 
ఇక కూటమిలో చిచ్చుపెట్టేలా హుస్నాబాద్‌ గొడవ ముదిరి పాకాన పడుతోంది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించే మూడు సీట్లలో హుస్నాబాద్‌ ఉంటుందని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే హుస్నాబాద్‌ సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున నియోజకవర్గం నాయకులు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే లేదు లేదు.. ఈ సీటు కాంగ్రెస్‌కే కేటాయిస్తారు.. పోటీలో నేనే ఉంటాను.. అధిష్టానం కూడా నాకు పచ్చజెండా ఊపిందని చెబుతూ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. దీనిపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. తమకు కేటాయించిన మూడు సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచడం న్యాయం కాదని కూటమి సభ్యుల ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement