వాగ్దాన శూరుడు కేసీఆర్‌  | Alliance Made A Seat For The Win Telangana TDP President L Ramana | Sakshi
Sakshi News home page

వాగ్దాన శూరుడు కేసీఆర్‌ 

Published Mon, Dec 3 2018 12:36 PM | Last Updated on Mon, Dec 3 2018 12:40 PM

Alliance Made A Seat For The Win Telangana TDP President L Ramana - Sakshi

హుస్నాబాద్‌ బహిరంగ సభలో అభివాదం తెలుపుతున్న ప్రజాకూటమి నాయకులు 

హుస్నాబాద్‌ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలు చేసి గెలిచాక నెరవేర్చకపోవడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు ఉండరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలో ప్రజాకూటమి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నాడని, కేసీఆర్‌కు ఓటేస్తే అది బీజేపీకి ముట్టినట్టవుతుందని అన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్‌.. నీళ్లు ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద దొర, నియోజకవర్గంలో చిన్న దొర ఉన్నాడని.., దొరల రాజ్యం పోవాలంటే పేదల రాజ్యం రావాలని అందుకు ప్రజలు ఆలోచించాలని కోరారు. కొండగట్టులో బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోతే వారిని పరామర్శించలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం చేశామని అన్నారు.

కేసీఆర్‌ అక్రమాలపై ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని జీవితాంతం జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రజాకూటమిలో భాగంగా తాను జగిత్యాల సీటును త్యాగం చేశానని, ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుందని, నావంతు సాయంగా ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి హుస్నాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలే నాలుగు రోజులు నిద్రాహారాలు మాని, కూటమిగా ఏర్పడ్డ నాలుగు జెండాలను హుస్నాబాద్‌లో ఎగురవేయాలని రమణ పిలుపునిచ్చాడు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో దొరల అహంకారం పెరిగిందని, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్‌ అని విమర్శించాడు. అందరి త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని.. చారిత్రాత్మక భద్రతగా గుర్తించి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించాలని అన్నారు. హుస్నాబాద్‌ సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి కేసీఆర్‌ను ఇంటికి పంపే కూటమిగా మారాలని అన్నారు. 2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. రీ డిజైన్ల పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు దోచుకుంటున్నారని, తాను గెలిస్తే సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించి నీరందిస్తానని అన్నారు.

ప్రజాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్, రాంగోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, గడిపె మల్లేష్, శోభారాణి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో అధ్యక్షుడు శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీడీపీ నాయకులు ప్రవీణ్‌కుమార్, బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, దొమ్మాటి మల్లేశం, తెలంగాణ జనసమితి నాయకులు కొంరెల్లి, చింతల రామచంద్రం, జీవన్‌రెడ్డి తదితరులున్నారు. 

ఆకట్టుకున్న వందేమాతరం శ్రీనివాస్‌ పాటలు 
హుస్నాబాద్‌ పట్టణంలో నిర్వహించిన ప్రజాకూటమి బహిరంగ సభకు వందేమాతరం శ్రీనివాస్‌ పాటలు హైలెట్‌గా నిలిచాయి. రాములమ్మ ఓ రాములమ్మ, ఎర్రజెండ.. ఎర్రజెండ ఎనియలో.. వంటి పాటలకు కళాకారులతో పాటు సభకు వచ్చిన జనం కోరస్‌ పాడుతూ ఉత్సాహంగా కనిపించారు. సభకు నియోజకవర్గం నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. హుస్నాబాద్‌ బహిరంగ సభలో పాటలు పాడుతున్న సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement