ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలు ‘మహా కూటమి’ లోని భాగస్వామ్య పక్షాలకే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలు కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడమే సంకేతంగా కనిపిస్తోంది. హుస్నాబాద్ స్థానంలో పోటీ చేస్తామని కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు టీజేఎస్ కూడా జిల్లాలో తాము మూడు స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాకున్నా పటాన్‌చెరులో టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న నందీశ్వర్ లోలోన ప్రచారాన్ని ప్రారంభించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : నామినేషన్ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహాకూటమి’లోని భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత ఇచ్చింది. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబ«ంధించి తామే సొంతంగా పోటీ చేస్తారా లేదా సీట్ల సర్దుబాటులో భాగస్వాములకు కేటాయిస్తారా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడం లేదు.
మరోవైపు కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరికి వారుగా తాము పోటీ చేసే స్థానాల జాబితాను ప్రకటించాయి. హుస్నాబాద్ స్థానం నుంచి తాము పోటీ చేస్తామని ఇప్పటికే సీపీఐ ప్రకటించగా, మూడు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉంటామని కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ స్పష్టం చేసింది. మెదక్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్ అభ్యర్థుల జాబితాను మాత్రం విడుదల చేయలేదు. మరోవైపు పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాన్ని కూటమి భాగస్వామ్య పార్టీ టీడీపీ కోరుతుండగా, అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ లోలోన ప్రచారం కూడా ప్రారంభించారు. నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖేడ్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొలిక్కి రాకపోవడంతో తొలి, రెండో జాబితాలోనూ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు.
కాంగ్రెస్‌లో రె‘బెల్స్’
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా ఐదు సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఐ ఆశిస్తున్న హుస్నాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ బాట పట్టారు. టీజేఎస్ తాము పోటీ చేస్తామని ప్రకటించిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన నేతలు నామినేషన్లు వేస్తున్నారు.
సిద్దిపేటలోనూ కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న తాడూరు శ్రీనివాస్‌గౌడ్, దరపల్లి చంద్రం నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు ఎల్.ప్రభాకర్ వర్మ కూడా అదే బాటలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కాంగ్రెస్ పక్షాన నామినేషన్ వేసి పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మ్యాడం బాలకృష్ణ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
టీడీపీ పోటీ పడుతున్న పటాన్‌చెరులో గోక శశికళ, సపాన్‌దేవ్, కాటా శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ పక్షాన నామినేషన్లు వేసి ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఏకంగా అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న మెదక్, దుబ్బాక, పటాన్‌చెరు, హుస్నాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేసి స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment