ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరింది. అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రలోభాలకు తెరలేపుతున్నారు. మద్యం, మనీ పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. పంపిణీ బాధ్యతలను కుటుంబ సభ్యులకు, నమ్మినబంట్లకు అప్పగిస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఏమేరకు పంపకాలు జరుగుతున్నాయో? తెలుసుకునేందుకు సైతం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికారులు అభ్యర్థుల ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీవ్రతరం చేశారు. ఇప్పటికే జిల్లాలో భారీగా మద్యం, మనీ పట్టుకున్నారు.
సాక్షి, మెదక్: ఎన్నికలకు ఇంకా ఐదురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న అభ్యర్థులు విజయం కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఓవైపు ముమ్మర ప్రచారం సాగిస్తూనే మరోవైపు ఎదుటి పార్టీలోని నేతలను తమవైపు తిప్పుకుంటున్నారు. కొంత మందిని కోవర్టులుగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఓటర్ల కోసం మద్యం, డబ్బులను ప్రధాన ఆస్త్రంగా మల్చుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఎన్నికల అధికారులు నిఘా పెట్టినా వారికి దొరక్కకుండా అభ్యర్థులు ఓటర్ల కోసం రహస్య మార్గాల్లో గ్రామాలకు మద్యం, మనీ చేరవేస్తున్నారు. మద్యం, డబ్బుల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు అధికార యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటంతోపాటు ప్రత్యేక బృందాలు వాహనాల తనిఖీలు చేస్తున్నాయి.
మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని, ప్రలోభాలకు గురికావద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
పట్టుబడిన మనీ వివరాలు
మెదక్ రూ.24.86 లక్షలు
నర్సాపూర్ రూ.23.22 లక్షలు
మొత్తం రూ.48.08 లక్షలు
ఓటుకెంత..?
పట్టణ, గ్రామీణ కూడళ్లలో ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. అదే సమయంలో మద్యం, డబ్బులు పంపిణీలు జరగుకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.48,08,480 నగదు లభించింది. మెదక్ నియోజకవర్గంలో రూ. రూ.24,86,400, నర్సాపూర్‌లో రూ.23,22,080 లక్షలు పట్టుబడ్డాయి.
అలాగే ఎక్సైజ్ అధికారుల జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో రూ.14,86,276 విలువ చేసే 21,123 లీటర్లు మద్యాన్ని సైతం పట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఐదురోజులు మిగిలి ఉండటంతో డబ్బు, మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే అవకావం ఉంది. దీనిని పసిగట్టిన తనిఖీ బృందాలు నిఘా పెంచాయి.
ప్రలోభాలకు తెరలేపుతున్న పార్టీలు
ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తూనే మరోవైపు ప్రలోభాలకు తెరతీస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమ గెలుపుకోసం ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధంగా లేరు. దీంతో డబ్బులు, మద్యం పంపిణీకి ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
గుట్టుగా తమ ముఖ్య అనుచరుల, బంధువుల ద్వారా డబ్బులు, మద్యం చేరవేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకు విలువ కట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి..
Comments
Please login to add a commentAdd a comment