కొండమల్లేపల్లి(దేవరకొండ) : దేవరకొండ డివిజన్‌లో నేడు జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఆలోపు లైన్‌లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కొద్దిసేపు విరామం తర్వాత లెక్కింపు చేపడుతారు. డివిజన్ పరిధిలోని పది మండలాల్లోని 252 గ్రామపంచాయతీలు, 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ పరిధిలోని మొత్తం 304 గ్రామపంచాయతీలకు గాను 52 పంచాయతీలు, 2572 వార్డులకు గాను 650 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 252 గ్రామపంచాయతీలు 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
డీఆర్‌సీ కేంద్రాల నుంచి పోలింగ్ స్టేషన్లకు
ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ(డిస్ట్రిబ్యూషన్ సెంటర్) నుంచి బ్యాలెట్ బాక్స్‌లు, సిరా, స్వస్తిక్ స్టాంపులతో పాటు ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన వాహనాల్లో ఆయా పంచాయతీలకు ఆదివారం బయల్దేరి వెళ్లారు. దేవరకొండ డివిజన్ పరిధిలో 106 రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు 2174 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు గాను స్టేజ్–1, స్టేజ్–2, పీఓ, ఏపీఓలతో పాటు పాటు సుమారుగా 5వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు ఆర్డీఓ లింగ్యానాయక్ తెలిపారు.
డీఆర్‌సీ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు
డివిజన్ పరిధిలోని పది మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు వేర్వేరుగా పరిశీలించారు. చింతపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లోని డీఆర్‌సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు పరిశీలించి ఎన్నికలు సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీఏపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. దేవరకొండ డీఆర్‌సీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భారీ బందోబస్తు
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఒక అడిషనల్ ఎస్పీ, 8మంది డీఎస్పీలు, సీఐలు–28మంది, ఎస్‌ఐలు–75మందితో పాటు 13 ప్లాటూన్ల ప్రత్యేక బలగాలను కేటాయించారు. మొత్తంగా సుమారు 2600 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. డివిజన్ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామపంచాయతీలను గుర్తించి వెబ్ కాస్టింగ్, ప్రత్యేక పోలీసులను మోహరించనున్నారు. డివిజన్ పరిధిలో 73 సమస్యాత్మక, 29 అతి సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసి దేవరకొండలోని డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 10 మంది వరకు పోలీసుల చేత నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు 105 రూట్లలో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి ఎక్కడ గొడవలు జరిగినా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటు పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే మద్యం షాపుల బంద్
పంచాయతీ ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో మద్యం షాపులు బంద్ చేయించారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మద్యం షాపులు తెరవరు. ప్రధానంగా గతంలో దేవరకొండ డివిజన్‌లో చందంపేట, డిండి, తదితర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా గొడవలు చోటు చేసుకున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేందుకువెబ్ కాస్టింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.
దేవరకొండ డీఆర్‌సీ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది, విధులకు వెళ్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment