trs win
-
గులాబీ గాలికి.. ఎదురీది!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా గులాబీ గాలి వీస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 20 మండలాల పరిధిలోని 581 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 30వ తేదీన నల్లగొండ డివిజన్లోని 256 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినా.. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీల్లో సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఇంతగా టీఆర్ఎస్ గాలి వీస్తున్నా.. కొన్ని పంచా యతీల్లో ఈ గాలిని తట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు సర్పంచులుగా గెలిచారు. తొలి, మలి విడతల్లో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా 168 పంచాయతీల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ముఖ్య నాయకుల గ్రామాలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేసినా.. తమ పార్టీ మద్దతుదారులను గట్టెకించుకోలేకపోయారు. టీఆర్ఎస్ నాయకత్వం కట్టకట్టుకుని ప్రచారం చేసిన పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలవడం, అత్యధిక వార్డులను కైవసం చేసుకోవడం వంటి అంశాలు గులాబీ నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొదటి, రెండో విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయా మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అనుముల మండలంలో కొత్తపల్లి, పంగవానికుంట గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. పెద్దవూర మండలంలో 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో పర్వేదుల, కొత్తల్లూరు, శిరసనగండ్ల, కుంకుడుచెట్టు తండా, చలకుర్తి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తిరుమలగిరి మండలంలో 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు శ్రీరాంపురం, అల్వాల, నాయకునితండా, తునుకినూతల గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. త్రిపురారం మండలంలో 16 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మండలంలో బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, బెజ్జికల్, వస్త్రాంతండా, అన్నారం, బొర్రాయిపాలెం, రాజేంద్రనగర్, చెన్నాయిపాలెం, సత్యనారాయణపురం, డొంకతండా, మాటూరు, దుగ్గెపల్లి, కామారెడ్డిగూడెం, నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అదే విధంగా నిడమనూరు మండలంలో 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మండలంలో నారమ్మగూడెం, తుమ్మడం, పార్వతీపురం, మార్లగడ్డతండా, రాజన్నగూడెం, శాఖాపురం, బంకాపురం, ఊట్కూరు, ముప్పారం, వడ్డెరగూడెం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గుర్రంపోడు మండలంలో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మండలంలో బుద్దరెడ్డిగూడెం, పాల్వాయి, జూనూతల, కాల్వపల్లి, తేరాటిగూడెం, నడికుడ, కొత్తలాపురం, తేనేపల్లి, పోచంపల్లి, ఎల్లమోనిగూడెం, ముల్కలపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మొదటి, రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలంలో అప్పలగూడెం, త్రిపురారం, మర్రిగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా మాటూరు, చెన్నాయిపాలెం, డొంకతండా, అంజనపల్లి, నీలాయిగూడెం, సత్యనారాయణపురం, బెజ్జికల్ గ్రామాల్లో ఎమ్మెల్యే నోముల ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. ఈ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా పెద్దవూర మండలంలోని పర్వేదులలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ గ్రామంలో 10 వార్డులకు పది కాంగ్రెస్ గెలుచుకుంది. నిడమనూరు మండలంలో బంకాపురం, నిడమనూరు, ముప్పారం, నారమ్మగూడెంలో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం ఉపయోగపడలేదు. ఈ పంచాయతీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో.. మిర్యాలగూడ డివిజన్‌లోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. దామరచర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కలిసి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోటిరెడ్డిని టీఆర్ఎస్లో చేర్పించి తమ పార్టీ మద్దతుతో పోటీ చేయించారు. ఆయనతోపాటు స్థానిక టీడీపీ నాయకులను కూడా టీఆర్ఎస్లో చేర్పించారు. అయినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీలైన వీర్లపాలెం, కొండ్రపోల్, నర్సాపురం, కల్లేపల్లి, మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు, రాయినిపాలెం, గూ డూరు, మాడ్గులపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని తోపుచర్ల, చిరుమర్తి, కన్నెకల్, వేములపల్లి మండలంలోని సల్కునూరు, కామేపల్లి, ఆమనగల్లు, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో తడకమళ్ల, ఉట్లపల్లి, ఆలగడప, తుంగపాడు గ్రామాల్లో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. అయినా కాంగ్రెస్ బలపర్చిన వారే విజయం సాధించారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు, రాయినిపాలెం, దామరచర్ల మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం, కల్లేపల్లి, నర్సాపురం, కొండ్రపోల్ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఎన్నికల ప్రచారం చేశారు. దామరచర్ల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గంపూడి నారాయణరెడ్డి స్వగ్రామమైన వీర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలిచారు. వేములపల్లి మండలంలోని సల్కునూరు, ఆమనగల్లు, కామేపల్లి, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం, మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తిలో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. కన్నెకల్‌లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దేవరకొండ డివిజన్లో.. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దేవరకొండ మండలంలో తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి, గొట్టిముక్కల గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తాటికోల్, తెలుగుపల్లి, కొమ్మేపల్లి గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ స్పల్ప మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. డిండి మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన డిండి పట్టణం, కామేపల్లి, తవక్లాపూర్, టి.గౌరారం, ప్రతాప్‌నగర్, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. కాగా టీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిండి, ఎర్రగుంటపల్లి గ్రామపంచాయతీల్లో రోడ్‌షో నిర్వహించినప్పటికీ పలితం లేదు. ఉమ్మడి చందంపేట మండలంలోని ప్రధాన పంచాయతీలైన కాచరాజుపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, రేకులగడ్డ, బుడ్డోనితండాలలో టీఆర్ఎస్ మద్దతుదారుల తరఫున ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలో మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల, పడమటితండా, అజ్మాపురం, నంభాపురం, కేశంనేనిపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన వారు గెలుపొందారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మేడారం, అంగడిపేట ఎక్స్‌రోడ్, చిల్కమర్రి, వద్దిపట్ల గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించినప్పటికీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులు ఆయా పంచాయతీలను కైవసం చేసుకున్నారు. చింతపల్లి మండలంలో వెంకటంపేట, చింతపల్లి గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రచారం నిర్వహించినప్పటికీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. -
టీఆర్ఎస్కు 70 సీట్లు
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మహాకూటమికి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ సంస్థలు ఈ నెల 12 నుంచి 18 మధ్య వారంపాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తాజా అంచనాలను వెల్లడించాయి. కాంగ్రెస్– టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాంగ్రెస్ గాయపరిచిందని ఈ సర్వేలో తేలడం విశేషం. ఈ బాబు– రాహుల్ దోస్తీని వ్యతిరేకిస్తున్నట్లు 52.44% మంది స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్ రావాలంటూ 45%, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి కావాలని 30% ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. మహా కూటమిలోని కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసి 36(కాంగ్రెస్ 21, టీడీపీ 15) సీట్లు గెల్చుకోగా.. ఈసారి అవి మొత్తంగా గెలుచుకునే స్థానా లు 33(కాంగ్రెస్ 31, టీడీపీ 2) కావడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్లశాతం(కాంగ్రెస్ 25.20%+టీడీపీ14.70%= 39.90%) కన్నా ఈ ఎన్నికల్లో తక్కువే ఉంటుందని(కాంగ్రెస్ 27.98%+టీడీపీ 05.66%=33.64%) పేర్కొంది. -
గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. పరోక్ష ఎన్నికల్లోనూ... పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది. ఫలించిన పాలేరు వ్యూహం! పాలేరు ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. -
టీఆర్ఎస్ విజయోత్సవంలో ఘర్షణ
పోచారంలో ఉద్రిక్తత కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. విజేత నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. 'పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదు. తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. గెలిచినంత మాత్రాన ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదు. సంస్కారం ఉండాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలి. ప్రతిపక్షాలకు కూడా ఒకమాట చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. రొడ్డకొట్టుడు మాదిరిగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ అంటే కమీషన్ కాకతీయ అన్నారు. మీకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా. దాడి చేయడమే రాజకీయం అనేది సరికాదని ప్రజలు పలుమార్లు చెబుతున్నారు. వ్యక్తిగత దాడి, విమర్శలు, నిందలు ఇకనైనా మానుకోవాలి' అని కేసీఆర్ అన్నారు. -
పాలేరులో తుమ్మల ఘనవిజయం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయం సాధించారు. తుమ్మల నాగేశ్వరరావు తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డిపై 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేశారు. సుచరితకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా ఆమెకు కలసిరాకపోవడంతో పాటు సానుభూతి పవనాలు వీయలేదు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచి ముందంజలో నిలిచిన తుమ్మల భారీ మెజార్టీ సాధించారు. -
ఫలించిన కేసీఆర్ వ్యూహం.. కేటీఆర్ ఉధృత ప్రచారం
చార్ సౌ షహర్.. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంపై టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని తానేంటో చూపించింది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం కేసీఆర్ ముందు నుంచి రచించిన వ్యూహంతో పాటు.. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఉధృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమైంది. ''గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించండి'' అన్న మాటలు కూడా ఓటర్ల మీద గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. సెటిలర్లు, ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన వరంగల్, నల్లగొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో తప్ప హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో టీఆర్ఎస్కు అంతగా పట్టు లేదనే అపప్రథ ఉండేది. అందుకే సనత్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా వెనకడుగు వేస్తూ.. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూపించాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ కూడా.. దాదాపు నగరంలోని అన్ని మూలలకూ సుడిగాలి పర్యటనలు చేసి, సెటిలర్ల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంతకుముందు జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయే రేంజిలో ఫలితాలు రాబట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ పర్యటనలు తగిన ఫలితాలను రాబట్టాయి. కేవలం కోర్‌సిటీలో మాత్రమే కాక.. శివారు ప్రాంతాల్లో సైతం తన పట్టు నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఈ ఎన్నికలను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది. కోర్ సిటీ మాట ఎలా ఉన్నా, శివారు ప్రాంతాలు.. అంటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారని, వాళ్ల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కు రావు కాబట్టి వాటిని కొల్లగొట్టగలిగితే అధికార పార్టీ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించొచ్చని కాంగ్రెస్‌తో పాటు టీడీపీ-బీజేపీ కూడా భావించాయి. కానీ అలా జరగలేదు. దాంతో ఆ పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. -
‘గులాబీ’లో తమిళ గుబాళింపు?
డేట్లైన్ హైదరాబాద్ వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఇచ్చిన ఊపులో ఆయన కొద్దిమాసాల తరువాత పార్టీలో అంతర్గతంగా బలపడుతున్న అధికార కేంద్రాలను నిర్వీర్యం చెయ్యడానికి అర్ధంతరంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు గురించీ, ఆయన రాజకీయ ఎత్తుగడలను గురించీ క్షుణ్ణంగా తెలిసినవారికి ఇదేమీ వింత వాదనగా కనిపించదు. లోహా గరం హై హ తోడీ మార్‌దో(ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలనుకునే) కోవకు చెందిన రాజకీయ నాయకుడు ఆయన. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితితో సహా ఎవరూ ఊహించనివి. తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని అందరికీ తెలుసు కానీ, ఆధిక్యతే ఎవరూ ఊహించనిది. తెలంగాణలో మున్నెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఆధిక్యత టీఆర్ఎస్ అభ్యర్థికి లభించడం దేనికి సంకేతమని అందరూ విశ్లేషణలు మొదలు పెట్టారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టం తెలంగాణ ఇక తమిళనాడు బాట పట్టినట్టేనా? రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోవడంతో అందరికీ అలాంటి సందేహం కలుగుతున్నది. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణలో జరిగిన రెండవ ఉప ఎన్నిక ఇది. మొదటి ఉప ఎన్నిక మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచిన మెదక్ లోక్‌సభ స్థానాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వదులుకుని గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పరిమితం అయినందున అక్కడ ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా ప్రజలు గెలిపించిన కొద్దిరోజులకే మెదక్ ఉప ఎన్నిక రావడం వల్ల ప్రతిపక్షాలు ఆనాడు గెలుపు మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. సహజంగానే టీఆర్ఎస్ గెలిచింది. రెండవ ఉప ఎన్నిక వరంగల్ పార్లమెంట్ స్థానం దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి వేరు. ప్రజలు పదిహేడు మాసాల టీఆర్ఎస్ పాలన చూశారు. మంచీ, చెడూ ఉన్నాయి. ఎన్నిక ఏకపక్షంగా జరగదని భావించాయి ప్రతిపక్షాలు. కానీ ప్రతిపక్షాలూ, మీడియాలోని ఒక వర్గం, కొంతమంది మేధావులూ, వామపక్షాలూ భావించినట్టుగా వరంగల్ ఫలితం రాలేదు. ప్రతిపక్షాలను మూర్ఛపోయేటట్టు చేసిన ఫలితం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలోనే చాలా మందికి ఇటువంటి ఫలితం వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రచారం తొలి రోజుల్లో అధికార పార్టీ పెద్దలే భిన్నస్వరాలు వినిపించారు. ఒకరు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక తమ పరిపాలన మీద రెఫరెండం కాబోదు అంటే, మరొకరు కచ్చితంగా రెఫరెండం అన్నారు. గెలుస్తాం కానీ మెజారిటీ తగ్గుతుందేమో అని సన్నాయి నొక్కులు నొక్కిన పెద్దలు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. అసలు వింత అక్కడ! నిజానికి వరంగల్ ఫలితం పెద్దగా ఆశ్చర్యపరిచేదేమీ కాదు. దీనితో పాటు మధ్యప్రదేశ్‌లోని రత్లాం పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఆశ్చర్యపరచవచ్చు. రత్లాంలో బీజేపీ ఓడి, కాంగ్రెస్ గెలిచింది. నిన్నటి దాకా అది బీజేపీ స్థానం. కేంద్రంలో, రాష్ర్టంలో కూడా అధికారంలో ఉండి, ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ధారాదత్తం చేసినందుకు బీజేపీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోవాలి కానీ, తన స్థానాన్ని తాను నిలుపుకున్న టీఆర్ఎస్ వరంగల్ గెలుపులో ఏం వింత ఉంటుంది? 17 మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వరంగల్ స్థానం నుంచి కడియం శ్రీహరి మూడు లక్షల 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్ధి పసునూరి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓట్ల ఆధిక్యాన్ని మరికొంత పెంచుకుని తన స్థానాన్ని తాను నిలుపుకున్న టీఆర్ఎస్ వరంగల్ గెలుపును విశేషంగా చెప్పుకోనక్కరలేదు. అయినా ఎందుకు అందరూ, అధికారపక్షంతో సహా ఇంత హడావుడి చేస్తున్నారు? అధికారపక్షం ఉద్వేగానికి లోనయితే, ప్రతిపక్షాలు జరగరానిదేదో జరిగిపోయినట్టు డీలా పడిపోయాయి. గెలుస్తామా అన్న సందేహం అధికారపక్షంలో కలగడం, ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా పని చేస్తుందన్న ధీమా ప్రతిపక్షాల్లో కలగడం అందుకు కారణం. పైన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ టీఆర్ఎస్కు, ఆ పార్టీ అధినేతకు బాగా తెలుసు. అందుకే గెలుపు మీదా, ఆ తరువాత ఆధిక్యత మీద సందేహాలు కలిగాయి. అందుకే ఎలక్షన్ మేనేజ్మెంట్ పక్కాగా చేసుకున్నారు. కాబట్టి మెజారిటి పెంచుకుని మరీ గెలవగలిగారు. నిజానికి వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రజలు టీఆర్ఎస్ను నిలదీయవలసి ఉండింది- ఏం అవసరం వచ్చిందని ఈ ఎన్నిక తెచ్చి పెట్టారు మా నెత్తిన అని! అసాధారణ సందర్భాలలో మాత్రమే రావలసిన ఉప ఎన్నిక వరంగల్‌కు ఎందుకొచ్చినట్టు? మీ కారణం మీకు ఉండొచ్చు- డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించేందుకు. మరి ఆయన స్థానంలో నియమించడానికి ఇంకో దళిత శాసనసభ్యుడే దొరకలేదా ముఖ్యమంత్రికి? అదే వరంగల్ జిల్లాలో తమ పార్టీకే చెందిన మరో ఇద్దరు దళిత శాసనసభ్యులు ఉన్నారు ఆ స్థానాన్ని భర్తీ చేసుకోడానికి. అట్లా చెయ్యకుండా ఒక పార్లమెంట్ సభ్యుడి చేత రాజీనామా చేయించి డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసి, ఈ ఉప ఎన్నిక అవసరం కల్పించారు. మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలనే విచక్షణ అధికారం ముఖ్యమంత్రిదే కానీ, ఇటువంటి నిర్ణయాలు పాలకుల అహంకారానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ఏమో, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఇచ్చిన ఊపులో ఆయన కొద్దిమాసాల తరువాత పార్టీలో అంతర్గతంగా బలపడుతున్న అధికార కేంద్రాలను నిర్వీర్యం చెయ్యడానికి అర్ధంతరంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు గురించి, ఆయన రాజకీయ ఎత్తుగడలను గురించి క్షుణ్ణంగా తెలిసినవారికి ఇదేమీ వింత వాదనగా కనిపించదు. లోహా గరం హై హతోడీ మార్‌దో( ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలనుకునే)కోవకు చెందిన రాజకీయ నాయకుడు ఆయన. 2019 నాటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో, ప్రజల్లో ఈ ఆకర్షణ ఉంటుందో లేదో అని ఆలోచించే నాయకుడు. ఇటువంటి నిర్ణయం ఒకటి గతంలో ఉమ్మడి రాష్ర్టంలో ఎన్.టి. రామారావు తీసుకున్న అనుభవం తెలుగు ప్రజలకు ఉంది. జాతీయ పార్టీల దుస్థితి ఇక ప్రతిపక్షాల విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ర్ట సమితి అనే ఒక సంస్థ పుడుతుందనీ, ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం పోరాడి సాధిస్తుందనీ ఎవరూ ఊహించని రోజుల్లో ఒక ఓటు - రెండు రాష్ట్రాలు అన్న నినాదాన్ని తీసుకుని చివరికి తెలంగాణ ఏర్పాటులో, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆ విధానానికే కట్టుబడి తన నిబద్ధత చాటుకున్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి దీనంగా మూడో స్థానంలో బిక్కు బిక్కు మంటూ నిలబడ్డది. ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేకుండా పోతామని తెలిసి కూడా తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కూడా ధరావతు కోల్పోయి వరంగల్ చౌరస్తాలో ఎడ్డి మొహం వేసుకుని నిలబడ్డది. నిజంగానే తెలంగాణలో మరీ ముఖ్యంగా వరంగల్‌లో ప్రజలు రెండు జాతీయ పార్టీలను కూడా పూర్తిగా తిరస్కరించినట్టేనా? 1982లో ఎన్.టి. రామారావు రాజకీయాల్లోకి వచ్చే వరకూ ఒక్కసారి (తెలంగాణ ప్రజాసమితి గెలుపు) మినహాయిస్తే కాంగ్రెస్‌కు ఎదురు ఉండేది కాదు. దేశమంతటా ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతి సునామీ అయి ప్రతిపక్షాన్ని మట్టి కరిపిస్తే దేశం మొత్తంలో బీజేపీ గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి వరంగల్ జిల్లా, హనుమకొండ. మరి ఆ రెండు జాతీయ పార్టీలకి ఇప్పుడు వరంగల్‌లో ఎందుకీ దుస్థితి పట్టింది? గెలుపు ఓటములు దైవాధీనాలు అనుకునే రోజులు పోయాయి, ఇప్పుడు గెలుపు ఓటములు స్వయంకృతాలు. కాంగ్రెస్‌కు ఢిల్లీ నాయకులొచ్చి అభ్యర్థులను నిర్ణయిస్తారు. తెలంగాణ లో పూర్తిగా అప్రతిష్ట పాలై ఉన్న టీడీపీ తోక పట్టుకుని ముందుకు వెళ్లే అగత్యం బీజేపీది. వరంగల్ జనం ఈ రెండు జాతీయ పార్టీలనూ ఛీత్కరించడానికి ఇవీ ప్రధాన కారణాలు. ప్రజా బంధువుకే ఆదరణ టీఆర్ఎస్ తన అభ్యర్థిగా స్థానికుడిని రంగంలోకి దింపింది. పసునూరి దయాకర్ వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామ వాస్తవ్యుడు. పొద్దున లేస్తే అక్కడి ప్రజలందరికీ కనిపించే మనిషి. కాంగ్రెస్ ఏం చేసింది? ఢిల్లీ నుండి విడతల వారీగా జాతీయ నాయకులొచ్చి ముందు ఇంటా బయటా తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుని తిరుగుతున్న ఒక నాయకుడిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయన స్థానికుడు కాదు, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినవాడు. తీరా అభ్యర్ధిని మార్చాల్సిన అవసరం వస్తే ఏం చేశారు? సోనియాగాంధీకి సాష్టాంగ ప్రణామం చేస్తాడనే అర్హత గల మరో స్థానికేతరుడిని ఆ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధి ప్రవాస భారతీయుడే అయినా వరంగల్ జిల్లా వాస్తవ్యుడు కావడం కొంత మెరుగే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులను, ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని వెంటేసుకుని తిరిగితే ఓట్లు ఎట్లా వస్తాయనుకున్నారు? ఈ విషయంలో బీజేపీ ఒక చారిత్రిక తప్పిదం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేసుకున్నా తెలంగాణ వరకు, అందునా వరంగల్ వంటి ఉద్యమ కేంద్రంలో టీడీపీకి దూరం జరిగి, ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పరువు నిలిపే సంఖ్యలో ఓట్లు వచ్చేవి. విపక్షాల స్వయంకృతం ఇక ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కూడా వాటి ఘోర పరాజయానికి కొంత కారణం. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చాయే కానీ అందులో ఒక్కరయినా ప్రజాకర్షణ శక్తి గలవారు ఉన్నారా అని ఆలోచించలేదు. చంద్రశేఖరరావును ఢీకొనగల వాక్పటిమ, ప్రజాకర్షణ గల నాయకులు ఆ రెండు జాతీయ పార్టీలకు స్థానికంగా గానీ, జాతీయ స్థాయిలో గానీ లేకపోయిరి.చంద్రశేఖర్‌రావును పదవి నుండి దింపేయాలి అన్న ప్రతిపక్షాల సింగిల్ పాయింట్ జనానికి వెగటు పుట్టించింది. ఇప్పటికయినా ప్రజల మధ్య ఉండే కార్యకర్తలను గుర్తించి రాబోయే ఎన్నికలకు వారిని తయారు చేసుకోకపోతే ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో తమిళనాట పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రానురాను ప్రజలు తెలంగాణ వాదానికీ గులాబీ నినాదానికీ తేడా మరిచిపోతే ప్రశ్నించేవాడే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలను నిలదీసే, పోరాడే ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి ఒక కొత్త శక్తి తెలంగాణ రాష్ట్రానికి అవసరమని వరంగల్ ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేస్తున్నది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం'
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ అధిక్యంతో విజయం సాధించడంపై తెలంగాణ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని కట్టబెడుతున్నారని అన్నారు. ఈ విజయాన్ని అందించిన వరంగల్ ప్రజలను కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రెఫరెండం అని చెప్పి మరీ ఈ ఎన్నికల్లో తలపడ్డామన్నారు. మా పనితీరుకు మీ తీర్పు నిదర్శనమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంటే... తాము మాత్రం గెలుస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే మా పనితీరుకు నిదర్శనమని తెలిపారు. భవిష్యత్‌లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కళ్లు తెరిచి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని కేసీఆర్.. ప్రతిపక్షాలకు సూచించారు. -
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం
-
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 8 స్థానాలలో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. కంటోన్మెంట్‌ను తొలిసారిగా టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు రామకృష్ణ (కాంగ్రెస్ రెబల్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు
మెదక్ : తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్లు గట్టి ఝలక్కే ఇచ్చారు. తాము ఇంకా కారు దిగి రాలేదని ఓటు ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి 2 లక్షల 10 వేల 523 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి లక్షా 86వేల 334 ఓట్లు పోలయ్యాయి. ఘోరంగా ఓటిపోయినా డిపాజిట్లు దక్కడంతో ఇద్దరు నేతలూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. 3 లక్షల 61 వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్కు మొత్తం 5లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షల 97 వేల,029 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
మెదక్ లోక్ సభ టీఆర్ఎస్ కైవసం
మెదక్ : ఊహించినట్లే మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 3 లక్షల 61వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్కు మొత్తం 5 లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ 3 లక్షల 97వేల,029 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించింది. అధికార పక్షాన్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలను మెదక్ ప్రజలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ లోక్‌సభకు ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ రెండు పార్టీలు డిపాజిట్లు దక్కించుకోగలిగాయి. -
ఈ విజయం ఊహించినదే : ప్రభాకర్ రెడ్డి
మెదక్ : మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆపార్టీ లోక్ సభ అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.