
‘గులాబీ’లో తమిళ గుబాళింపు?
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఇచ్చిన ఊపులో ఆయన కొద్దిమాసాల తరువాత పార్టీలో అంతర్గతంగా బలపడుతున్న అధికార కేంద్రాలను నిర్వీర్యం చెయ్యడానికి అర్ధంతరంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపోనక్కర లేదు.
డేట్‌లైన్ హైదరాబాద్
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఇచ్చిన ఊపులో ఆయన కొద్దిమాసాల తరువాత పార్టీలో అంతర్గతంగా బలపడుతున్న అధికార కేంద్రాలను నిర్వీర్యం చెయ్యడానికి అర్ధంతరంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు గురించీ, ఆయన రాజకీయ ఎత్తుగడలను గురించీ క్షుణ్ణంగా తెలిసినవారికి ఇదేమీ వింత వాదనగా కనిపించదు. లోహా గరం హై హ తోడీ మార్దో(ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలనుకునే) కోవకు చెందిన రాజకీయ నాయకుడు ఆయన.
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితితో సహా ఎవరూ ఊహించనివి. తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని అందరికీ తెలుసు కానీ, ఆధిక్యతే ఎవరూ ఊహించనిది. తెలంగాణలో మున్నెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఆధిక్యత టీఆర్‌ఎస్ అభ్యర్థికి లభించడం దేనికి సంకేతమని అందరూ విశ్లేషణలు మొదలు పెట్టారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టం తెలంగాణ ఇక తమిళనాడు బాట పట్టినట్టేనా? రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోవడంతో అందరికీ అలాంటి సందేహం కలుగుతున్నది. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణలో జరిగిన రెండవ ఉప ఎన్నిక ఇది. మొదటి ఉప ఎన్నిక మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచిన మెదక్ లోక్‌సభ స్థానాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వదులుకుని గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పరిమితం అయినందున అక్కడ ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా ప్రజలు గెలిపించిన కొద్దిరోజులకే మెదక్ ఉప ఎన్నిక రావడం వల్ల ప్రతిపక్షాలు ఆనాడు గెలుపు మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. సహజంగానే టీఆర్‌ఎస్ గెలిచింది. రెండవ ఉప ఎన్నిక వరంగల్ పార్లమెంట్ స్థానం దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి వేరు. ప్రజలు పదిహేడు మాసాల టీఆర్‌ఎస్ పాలన చూశారు. మంచీ, చెడూ ఉన్నాయి. ఎన్నిక ఏకపక్షంగా జరగదని భావించాయి ప్రతిపక్షాలు.
కానీ ప్రతిపక్షాలూ, మీడియాలోని ఒక వర్గం, కొంతమంది మేధావులూ, వామపక్షాలూ భావించినట్టుగా వరంగల్ ఫలితం రాలేదు. ప్రతిపక్షాలను మూర్ఛపోయేటట్టు చేసిన ఫలితం వచ్చింది. టీఆర్‌ఎస్ పార్టీలోనే చాలా మందికి ఇటువంటి ఫలితం వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రచారం తొలి రోజుల్లో అధికార పార్టీ పెద్దలే భిన్నస్వరాలు వినిపించారు. ఒకరు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక తమ పరిపాలన మీద రెఫరెండం కాబోదు అంటే, మరొకరు కచ్చితంగా రెఫరెండం అన్నారు. గెలుస్తాం కానీ మెజారిటీ తగ్గుతుందేమో అని సన్నాయి నొక్కులు నొక్కిన పెద్దలు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు.
అసలు వింత అక్కడ!
నిజానికి వరంగల్ ఫలితం పెద్దగా ఆశ్చర్యపరిచేదేమీ కాదు. దీనితో పాటు మధ్యప్రదేశ్‌లోని రత్లాం పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఆశ్చర్యపరచవచ్చు. రత్లాంలో బీజేపీ ఓడి, కాంగ్రెస్ గెలిచింది. నిన్నటి దాకా అది బీజేపీ స్థానం. కేంద్రంలో, రాష్ర్టంలో కూడా అధికారంలో ఉండి, ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ధారాదత్తం చేసినందుకు బీజేపీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోవాలి కానీ, తన స్థానాన్ని తాను నిలుపుకున్న టీఆర్‌ఎస్ వరంగల్ గెలుపులో ఏం వింత ఉంటుంది? 17 మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వరంగల్ స్థానం నుంచి కడియం శ్రీహరి మూడు లక్షల 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్ధి పసునూరి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓట్ల ఆధిక్యాన్ని మరికొంత పెంచుకుని తన స్థానాన్ని తాను నిలుపుకున్న టీఆర్‌ఎస్ వరంగల్ గెలుపును విశేషంగా చెప్పుకోనక్కరలేదు. అయినా ఎందుకు అందరూ, అధికారపక్షంతో సహా ఇంత హడావుడి చేస్తున్నారు? అధికారపక్షం ఉద్వేగానికి లోనయితే, ప్రతిపక్షాలు జరగరానిదేదో జరిగిపోయినట్టు డీలా పడిపోయాయి.
గెలుస్తామా అన్న సందేహం అధికారపక్షంలో కలగడం, ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా పని చేస్తుందన్న ధీమా ప్రతిపక్షాల్లో కలగడం అందుకు కారణం. పైన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ టీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేతకు బాగా తెలుసు. అందుకే గెలుపు మీదా, ఆ తరువాత ఆధిక్యత మీద సందేహాలు కలిగాయి. అందుకే ఎలక్షన్ మేనేజ్‌మెంట్ పక్కాగా చేసుకున్నారు. కాబట్టి మెజారిటి పెంచుకుని మరీ గెలవగలిగారు.
నిజానికి వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రజలు టీఆర్‌ఎస్‌ను నిలదీయవలసి ఉండింది- ఏం అవసరం వచ్చిందని ఈ ఎన్నిక తెచ్చి పెట్టారు మా నెత్తిన అని! అసాధారణ సందర్భాలలో మాత్రమే రావలసిన ఉప ఎన్నిక వరంగల్‌కు ఎందుకొచ్చినట్టు? మీ కారణం మీకు ఉండొచ్చు- డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించేందుకు. మరి ఆయన స్థానంలో నియమించడానికి ఇంకో దళిత శాసనసభ్యుడే దొరకలేదా ముఖ్యమంత్రికి? అదే వరంగల్ జిల్లాలో తమ పార్టీకే చెందిన మరో ఇద్దరు దళిత శాసనసభ్యులు ఉన్నారు ఆ స్థానాన్ని భర్తీ చేసుకోడానికి. అట్లా చెయ్యకుండా ఒక పార్లమెంట్ సభ్యుడి చేత రాజీనామా చేయించి డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసి, ఈ ఉప ఎన్నిక అవసరం కల్పించారు. మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలనే విచక్షణ అధికారం ముఖ్యమంత్రిదే కానీ, ఇటువంటి నిర్ణయాలు పాలకుల అహంకారానికి నిదర్శనాలుగా నిలుస్తాయి.
ఏమో, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఇచ్చిన ఊపులో ఆయన కొద్దిమాసాల తరువాత పార్టీలో అంతర్గతంగా బలపడుతున్న అధికార కేంద్రాలను నిర్వీర్యం చెయ్యడానికి అర్ధంతరంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు గురించి, ఆయన రాజకీయ ఎత్తుగడలను గురించి క్షుణ్ణంగా తెలిసినవారికి ఇదేమీ వింత వాదనగా కనిపించదు. లోహా గరం హై హతోడీ మార్దో( ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలనుకునే)కోవకు చెందిన రాజకీయ నాయకుడు ఆయన. 2019 నాటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో, ప్రజల్లో ఈ ఆకర్షణ ఉంటుందో లేదో అని ఆలోచించే నాయకుడు. ఇటువంటి నిర్ణయం ఒకటి గతంలో ఉమ్మడి రాష్ర్టంలో ఎన్.టి. రామారావు తీసుకున్న అనుభవం తెలుగు ప్రజలకు ఉంది.
జాతీయ పార్టీల దుస్థితి
ఇక ప్రతిపక్షాల విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ర్ట సమితి అనే ఒక సంస్థ పుడుతుందనీ, ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం పోరాడి సాధిస్తుందనీ ఎవరూ ఊహించని రోజుల్లో ఒక ఓటు - రెండు రాష్ట్రాలు అన్న నినాదాన్ని తీసుకుని చివరికి తెలంగాణ ఏర్పాటులో, పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆ విధానానికే కట్టుబడి తన నిబద్ధత చాటుకున్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి దీనంగా మూడో స్థానంలో బిక్కు బిక్కు మంటూ నిలబడ్డది. ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేకుండా పోతామని తెలిసి కూడా తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కూడా ధరావతు కోల్పోయి వరంగల్ చౌరస్తాలో ఎడ్డి మొహం వేసుకుని నిలబడ్డది.
నిజంగానే తెలంగాణలో మరీ ముఖ్యంగా వరంగల్‌లో ప్రజలు రెండు జాతీయ పార్టీలను కూడా పూర్తిగా తిరస్కరించినట్టేనా? 1982లో ఎన్.టి. రామారావు రాజకీయాల్లోకి వచ్చే వరకూ ఒక్కసారి (తెలంగాణ ప్రజాసమితి గెలుపు) మినహాయిస్తే కాంగ్రెస్‌కు ఎదురు ఉండేది కాదు. దేశమంతటా ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతి సునామీ అయి ప్రతిపక్షాన్ని మట్టి కరిపిస్తే దేశం మొత్తంలో బీజేపీ గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి వరంగల్ జిల్లా, హనుమకొండ. మరి ఆ రెండు జాతీయ పార్టీలకి ఇప్పుడు వరంగల్‌లో ఎందుకీ దుస్థితి పట్టింది? గెలుపు ఓటములు దైవాధీనాలు అనుకునే రోజులు పోయాయి, ఇప్పుడు గెలుపు ఓటములు స్వయంకృతాలు. కాంగ్రెస్‌కు ఢిల్లీ నాయకులొచ్చి అభ్యర్థులను నిర్ణయిస్తారు. తెలంగాణ లో పూర్తిగా అప్రతిష్ట పాలై ఉన్న టీడీపీ తోక పట్టుకుని ముందుకు వెళ్లే అగత్యం బీజేపీది. వరంగల్ జనం ఈ రెండు జాతీయ పార్టీలనూ ఛీత్కరించడానికి ఇవీ ప్రధాన కారణాలు.
ప్రజా బంధువుకే ఆదరణ
టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా స్థానికుడిని రంగంలోకి దింపింది. పసునూరి దయాకర్ వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామ వాస్తవ్యుడు. పొద్దున లేస్తే అక్కడి ప్రజలందరికీ కనిపించే మనిషి. కాంగ్రెస్ ఏం చేసింది? ఢిల్లీ నుండి విడతల వారీగా జాతీయ నాయకులొచ్చి ముందు ఇంటా బయటా తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుని తిరుగుతున్న ఒక నాయకుడిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయన స్థానికుడు కాదు, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినవాడు. తీరా అభ్యర్ధిని మార్చాల్సిన అవసరం వస్తే ఏం చేశారు? సోనియాగాంధీకి సాష్టాంగ ప్రణామం చేస్తాడనే అర్హత గల మరో స్థానికేతరుడిని ఆ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధి ప్రవాస భారతీయుడే అయినా వరంగల్ జిల్లా వాస్తవ్యుడు కావడం కొంత మెరుగే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులను, ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని వెంటేసుకుని తిరిగితే ఓట్లు ఎట్లా వస్తాయనుకున్నారు? ఈ విషయంలో బీజేపీ ఒక చారిత్రిక తప్పిదం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేసుకున్నా తెలంగాణ వరకు, అందునా వరంగల్ వంటి ఉద్యమ కేంద్రంలో టీడీపీకి దూరం జరిగి, ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పరువు నిలిపే సంఖ్యలో ఓట్లు వచ్చేవి.
విపక్షాల స్వయంకృతం
ఇక ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కూడా వాటి ఘోర పరాజయానికి కొంత కారణం. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చాయే కానీ అందులో ఒక్కరయినా ప్రజాకర్షణ శక్తి గలవారు ఉన్నారా అని ఆలోచించలేదు. చంద్రశేఖరరావును ఢీకొనగల వాక్పటిమ, ప్రజాకర్షణ గల నాయకులు ఆ రెండు జాతీయ పార్టీలకు స్థానికంగా గానీ, జాతీయ స్థాయిలో గానీ లేకపోయిరి.చంద్రశేఖర్‌రావును పదవి నుండి దింపేయాలి అన్న ప్రతిపక్షాల సింగిల్ పాయింట్ జనానికి వెగటు పుట్టించింది. ఇప్పటికయినా ప్రజల మధ్య ఉండే కార్యకర్తలను గుర్తించి రాబోయే ఎన్నికలకు వారిని తయారు చేసుకోకపోతే ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో తమిళనాట పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రానురాను ప్రజలు తెలంగాణ వాదానికీ గులాబీ నినాదానికీ తేడా మరిచిపోతే ప్రశ్నించేవాడే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలను నిలదీసే, పోరాడే ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి ఒక కొత్త శక్తి తెలంగాణ రాష్ట్రానికి అవసరమని వరంగల్ ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేస్తున్నది.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com