మెదక్ లోక్ సభ టీఆర్ఎస్ కైవసం
మెదక్ : ఊహించినట్లే మెదక్ లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 3 లక్షల 61వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు మొత్తం 5 లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ 3 లక్షల 97వేల,029 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కౌంటింగ్లో టీఆర్ఎస్ ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించింది.
అధికార పక్షాన్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలను మెదక్ ప్రజలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ లోక్సభకు ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ రెండు పార్టీలు డిపాజిట్లు దక్కించుకోగలిగాయి.