న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మహాకూటమికి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ – సీఎన్‌ఎక్స్ సంస్థలు ఈ నెల 12 నుంచి 18 మధ్య వారంపాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తాజా అంచనాలను వెల్లడించాయి. కాంగ్రెస్– టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాంగ్రెస్ గాయపరిచిందని ఈ సర్వేలో తేలడం విశేషం.
ఈ బాబు– రాహుల్ దోస్తీని వ్యతిరేకిస్తున్నట్లు 52.44% మంది స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్ రావాలంటూ 45%, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి కావాలని 30% ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. మహా కూటమిలోని కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసి 36(కాంగ్రెస్ 21, టీడీపీ 15) సీట్లు గెల్చుకోగా.. ఈసారి అవి మొత్తంగా గెలుచుకునే స్థానా లు 33(కాంగ్రెస్ 31, టీడీపీ 2) కావడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్లశాతం(కాంగ్రెస్ 25.20%+టీడీపీ14.70%= 39.90%) కన్నా ఈ ఎన్నికల్లో తక్కువే ఉంటుందని(కాంగ్రెస్ 27.98%+టీడీపీ 05.66%=33.64%) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment