
నల్లగొండ : మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నల్లగొండ డివిజన్‌లో 257 గ్రామపంచాయతీలు ఉండగా ఉపసంహరణ ముగిసే సమయానికి ఒకే నామినేషన్ ఉండడంతో 16 గ్రామ పంచా యతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. నల్ల గొండ డివిజన్ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రిటర్నింగ్‌అధికారి, ఆర్‌డీఓ జగదీశ్‌రెడ్డి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీలు, 21న అప్పీళ్ల పరిష్కారం, 22 మంగళవారంమధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగింది. గడువు ముగిశాక 16 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒకే నామినేషన్ ఉండడంతో వాటిని ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
మూడో విడతలో తగ్గిన ఏకగ్రీవాలు
మొదటి, రెండో విడతలతో పోల్చుకుంటే మూడో విడత గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు తగ్గాయి. మొదటి విడతలో 52, రెండో విడతలో మరో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడో విడత జరిగే నల్లగొండ డివిజన్‌లో మాత్రం ఏకగ్రీవాల సంఖ్య తగ్గింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే, మునుగోడు నియోజకవర్గంలో రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. నల్లగొండలో మాత్రమే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. అధికార పక్షం ఏకగ్రీవానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. చాలా చోట్ల ప్రతిపక్షాల కంటే స్వపక్షం నుంచే పోటీ ఎక్కువైంది. ఇది టీఆర్‌ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది. దీంతోనే నల్లగొండ డివిజన్‌లో ఏకగ్రీవాల సంఖ్య తగ్గిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
241 పంచాయతీలకు ఎన్నికలు
నల్లగొండ డివిజన్ పరిధిలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 241 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి పోటీలో ఉన్న వారి జాబితాను ప్రకటించి ఎన్నికల గుర్తులను కూడా కేటాయించారు.
ఏకగ్రీవమైన గ్రామాలు
నల్లగొండ మండలంలో పెద్ద సూరారం, ఖుదావన్‌పూర్, మునుగోడులో దుబ్బకాల్వ, తిప్పర్తి మండలంలో కంకణాలపల్లి, చండూరు మండలంలోని ఉడతలపల్లి, జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, పడమటితాళ్ల, బోడంగిపర్తి, చొప్పవారిగూడెం, నార్కట్‌పల్లి మండలంలో షేరిబాయిగూడెం, కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, ఇస్లాంనగర్, మారెపల్లి గౌరారం, నకిరేకల్ మండలంలో నడిగూడెం, కట్టంగూర్ మండలంలో రామచంద్రాపురం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.
అధికం టీఆర్‌ఎస్సే...
నల్లగొండ డివిజన్‌లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీ వం కాగా అందులో అత్యధికంగా టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే అధికంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు.