తొలి సమరం నేడే | Telangana Panchayat Elections Warangal | Sakshi
Sakshi News home page

తొలి సమరం నేడే

Published Mon, Jan 21 2019 11:39 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Telangana Panchayat Elections Warangal - Sakshi

ఆత్మకూరు(పరకాల): ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్లె పోరు మొదటి దశ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంది. జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బ్యాలెట్‌ బాక్స్‌లు, సిబ్బందిని తరలించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచారు. జోరుగా సాగిన ప్రచారం శనివారంతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా మరికొన్ని గంటల్లో సర్పంచ్‌గిరి ఎవరిని వరించనుందో తేలనుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుపై తమకు వచ్చే ఓట్లను లెక్కలేసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చిన పార్టీల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. జిల్లాలో తొలి దశలోనే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో ఎక్కువ స్థానాలు గెలిచి రెండు, మూడో విడత ఎన్నికల్లో ప్రభావం చూపాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి.సోమవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగుతుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆతర్వాత గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్‌ ఎంపిక ఉంటుంది. నేడు తొలివిడతలో 145 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా ఇందులో 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 100 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌కు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కావడానికి అధికార పార్టీ నేతలు ఈ సారి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. గతంలో కంటే పెద్దమొత్తంలో సర్పంచ్‌ స్థానాలు, వార్డు సభ్యులు ఏకగ్రీవమవడం విశేషం.

1535 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం..
మొదటి విడత పోలింగ్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి సామగ్రిని అందజేశారు. ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందచేశారు. మొదటి విడత ఎన్నికలకు 
1264 పోలింగ్‌స్టేషన్లను సిద్దం చేశారు.వీరికి 1535 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు. దుగ్గొండి మం డలంలో 282 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి 344 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు.నర్సంపేట మండలంలో 238 పోలింగ్‌ స్టేషన్లకు 289 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటుచేశారు. పర్వతగిరి మండలంలో 288 పోలింగ్‌స్టేషన్లకు 350 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సంగెం మండలంలో 286 పోలింగ్‌స్టేషన్లకు 348 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు. వర్ధన్నపేట మండలంలో 170 పోలింగ్‌ స్టేషన్లకు 205 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు.

3015 మంది సిబ్బంది..
మొదటివిడత పోలింగ్‌కు 3015 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 43 మంది స్టేజ్‌–1ఆర్‌ఓ, 43 మంది స్టేజ్‌–1 ఏఆర్‌ఓ, 145 మంది స్టేజ్‌–2 ఏఆర్‌ఓ, 1264 మంది పీఓ, 1454 ఓపీఓలు, 44 మంది రూట్‌ ఆఫీసర్లు, 22 మంది జోనల్‌ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు.

ఒకేరోజు పోలింగ్, ఫలితాలు..
నేడు(సోమవారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఇదే రోజు సాయంత్రం వరకు లెక్కింపు జరుగుతుంది. ఒకే రోజులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్నో ఆశలతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొన్నది. అభ్యర్థులు గ్రామాల్లో శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు.

ఒక్కో ఓటు కీలకమే..
స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎన్నికల్లో కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు ప్రతి ఓటుపై దృష్టి పెడుతున్నారు.దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లలో ఆఫర్లు చెబుతూ పోలింగ్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే గ్రామాల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా నేడు రాత్రివరకు నూరు పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఓట్లు సమానంగా వస్తే టాస్‌.. 
పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారింది. తక్కువ ఓటర్లుండి ఎక్కువ అభ్యర్థులు పోటీ ఉన్న చోట ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాస్‌ వేయడం లేదా చిట్టీలు తీయడం వంటి పద్ధతులను అనుసరించనున్నారు. అయితే అభ్యర్థులు మాత్రం పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఓటును బ్యాలెట్‌ బాక్స్‌కు చేరాలా అభ్యర్థులు గ్రామాల్లో ఓటు హక్కు ఉండి నగరాల్లో విద్య, ఉద్యోగాలు చేస్తున్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి చేరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement