నేటితో ప్రచారానికి తెర  | Telangana Panchayat Election Campaign Today Last Warangal | Sakshi
Sakshi News home page

నేటితో ప్రచారానికి తెర 

Published Mon, Jan 28 2019 12:28 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Telangana Panchayat Election Campaign Today Last Warangal - Sakshi

ఆత్మకూరు(పరకాల): మూడోవితడ జీపీ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 22న ముగిశాయి. 23 నుంచి అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లను ఓటుకోసం శతవిధాల అభ్యర్థిస్తున్నారు.నేడు (సోమవారం)ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటల తర్వాత ప్రచారానికి తెరపడనున్నది.మూడోవిడత ఎన్నికలు ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. చెన్నారావుపేటలో 30 గ్రామపంచాయతీలకు గాను కాలనాయక్‌తండా, బోజెర్వు, ఖాదర్‌పేట, గొల్లభామతండా, తిమ్మరాయనిపహాడ్‌ జీపీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 25జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి.

నెక్కొండ మండలంలో 39 జీపీలకు గాను అలంకానిపేట, లావుడ్యనాయక్‌తండా, వెంకటనాయక్‌తండా, రెడ్యానాయక్‌తండా, హరిచంద్‌తండా, చెరువు ముందరితండా, నెక్కొండతండా, దేవునితండా, అప్పలరావుపేట, మూడుతండా, గొల్లపల్లి, మేడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 27 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆత్మకూరులో 16 గ్రామపంచాయతీలు ఉండగా పెంచికలపేట, గుడెప్పాడ్, కామారం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 13జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. కామారంలో వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. దామెర మండలంలో 14 గ్రామపంచాయతీలు ఉండగా కొగిల్వాయి, సింగరాజుపల్లె, ల్యాదెళ్ల, దమ్మన్నపేట, దుర్గంపేట, సీతారాంపురం గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎనిమిది గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గీసుకొండ మండలంలో 21 జీపీలకు గాను గీసుకొండ,మచ్చాపూర్, మరియపురం, హర్జతండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 17జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్య నాయకుల ప్రచారం.. 
గ్రామాలలో ప్రచారరథాలు, మైకులతో హోరెత్తించారు.కొన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు, దామెర మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఉత్తర జిల్లాల కో ఆర్డినేటర్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అలాగే దామెరలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ప్రలోభాలు షురూ...
ప్రచారం గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు ప్రలోబాలు షురూ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులు ఇప్పటికే తమ గుర్తులకు సంబంధించిన వస్తువులను సంకేతంగా ఉండడానికి ఓటర్లకు చేరవేశారు. వార్డు సభ్యుల ద్వారా మద్యం బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని కొన్ని చోట్ల మాంసం పార్సిళ్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం దుకాణాలు బంద్‌ కానుండడంతో ఇప్పటికే మద్యం డంప్‌చేసి భద్రపర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ఓటర్ల జాబితాలను పరిశీలిస్తూ డబ్బుల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వినికిడి. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు ఇప్పటికే అభ్యర్థులు ఫోన్లు చేసి ఆఫర్లు పెట్టినట్లు తెలుస్తోంది.

అభ్యర్థులో టెన్షన్‌..
ప్రచారం గడువు ముగుస్తుండడం, పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండడంతో గ్రామపంచాయతీలలో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే దావత్‌లకు, ప్రచారానికి డబ్బులు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఓట్లకు నగదు పంపిణీచేయనున్నట్లు ప్రచారం జరుగుతండగా రూ.లక్షలో ఖర్చుపెట్టి ఫలితం ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 30న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement