నేటితో ప్రచారం సమాప్తం..  | Today Is Last Telangana Panchayat Election Campaign End | Sakshi
Sakshi News home page

నేటితో ప్రచారం సమాప్తం.. 

Published Mon, Jan 28 2019 10:11 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Today Is Last Telangana  Panchayat Election Campaign End - Sakshi

కరీంనగర్‌:  జిల్లాలో మూడోవిడత నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనుంది. ఎన్నికలకు ఇక రెండురోజులే మిగిలి ఉండడంతో పల్లెల్లో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. జిల్లాలో మూడోవిడత ఐదు మండలాలు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, ఇల్లందకుంట మండలాలోŠల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లోని 109 సర్పంచ్‌ స్థానాలకు ఇప్పటికే 13 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 96 స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొత్తంగా 404 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,024 వార్డుస్థానాలకు 227 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 797వార్డు స్థానాలకు 2,184 మంది బరిలో నిలిచారు. గ్రామాల్లో పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాలు, యువజన సంఘాలు, ఇతర కులాలను ఇలా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు.

బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు సహా ఉద్యోగ, ఉపాధి, చదువురీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని రప్పించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. చాలాగ్రామాల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీతోపాటు మద్యం ఏరులై పారిస్తున్నారు. పెద్ద పంచాయతీలు మొదలు చిన్న గ్రామాలు సైతం ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.లక్షలు దాటినట్లు సమాచారం. గ్రామాల్లో పెద్ద కుటుంబాలు మొదలు, కాలనీలు, యువజన సంఘాలు, కులసంఘాలు, వార్డుల వారీగా ప్రచారం చేస్తూ వారి ఓట్లను రాబట్టేందుకు ఎంతకైనా సిద్ధమంటూ హామీలిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే తమస్థాయికి తగినట్లు పదిరోజుల నుంచి మద్యాన్ని కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు.

కావాల్సిన మద్యాన్ని ముందే కొనుగోలు చేసి తమకు నమ్మకమైన వారి ఇళ్లల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మేజర్‌ గ్రామపంచాయతీల్లో అదీ.. జనరల్‌ అయిన గ్రామపంచాయతీల్లో నగదు ప్రభావం విపరీతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన గుర్తుల నమూనాలతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుల బొమ్మలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న పెద్ద కుటుంబాలకు వెండి నాణాలు బహూకరిస్తున్నట్లు సమాచారం. 5 నుంచి 10ఓట్లు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేస్తూ అభ్యర్థులు వారికి నజరానాలు ముట్టజెప్పుతున్నారు. ఇక వార్డు సభ్యులుగా పోటీచేస్తున్న వారు సైతం వెనుకాడకుండా తమకు కేటాయించిన గుర్తులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రిజర్వ్‌ గ్రామపంచాయతీల్లో ఉపసర్పంచ్‌ పదవులకు ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గ్రామాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు సైతం వార్డు మెంబర్లుగా పోటీ చేస్తూ విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. మూడవ విడత పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రచార హోరుతో పల్లెల్లో పంచాయతీ రాజకీయం వేడెక్కింది.

నిబంధనలు కీలకం..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలి. ప్రచారంలో అభ్యర్థులు సంబంధిత అధికారుల ద్వారా ముందస్తు లిఖితపూర్వక అనుమతులు లేకుండా, ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయాన్ని మించి ఊరేగింపులు తీయొద్దు. ప్రచారంలో లౌడ్‌ స్పీకర్లను వినియోగించకూడదు. ప్రభుత్వ, ప్రై వేట్‌ స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లు అంటించొద్దు. గోడలపై ప్రచార రాతలతో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ఇలా చేస్తే 1997 చట్టం ప్రకారం మూడు నెలల కారగార శిక్ష.. లేదా రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇంటి యజమానుల అనుమతి తీసుకుని ప్రచారానికి వినియోగించుకోవచ్చు. రాతపూర్వకమైన అనుమతులు తీసుకుని ఆ పత్రాన్ని ఎన్నికల అధికారులకు పంపాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైౖ వేట్‌ స్థలంలో సమావేశాన్ని నిర్వహించుకోవాలనుకున్నా.. కచ్చితంగా అనుమతి ఉండాల్సిందే. దేవాలయాలు, మసీదులు, చర్చిలు లేదా ప్రార్థన మందిరాలకు సంబంధించిన స్థలాల్లో ప్రచారం చేయడానికి అనుమతి ఉండదు. సభలు, సమావేశాలు నిర్వహించొద్దు. జాతి, మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఓటు వేయాలని కోరొద్దు. వ్యక్తిగత ఆరోపణలు చేయరాదు. అభ్యర్థుల నివాసాల వద్ద ప్రత్యర్థి పార్టీల వారు పో టాపోటీ కార్యకలాపాలు నిర్వహించొద్దు. ఎన్నికల ఊరేగింపుల నిర్వహణకు అనుమతి ఉండాలి. ఒక అభ్యర్థి ఊరేగింపు చేస్తున్నప్పుడు పోటీగా మరో ప్రదర్శన తీయరాదు. అనుమతులు పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోల వద్ద లౌడ్‌ స్పీకర్లు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement