ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు చాలా హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయాలకు తొలిమెట్టు అయిన పంచాయతీల్లో గెలుపొందేందుకు సర్పంచ్ అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. రిజర్వేషన్‌లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల రోజు వరకు కులసంఘాలు, యువకులను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల మధ్యలోనే వచ్చిన సంక్రాంతి పండుగను కూడా వదలలేదు. సర్పంచ్, వార్డుమెంబర్‌గా బరిలో ఉన్న వారు నేరుగా ఇళ్లకే మద్యం, మాంసం ఇస్తూ తమను ‘గుర్తు’ంచుకునేలా చేశారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 210 గ్రామాల్లో దాదాపు రూ.105 కోట్ల వరకు వెచ్చించారు. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుండగా.. ఓడిన వారు ఎలా జరిగిందనేదానిపై సమీక్షించుకుంటున్నారు.
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా రెండు గ్రామాలు మినహా 253 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 43 గ్రామాల్లో ఏకగ్రీవంకాగా.. 210 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో జిల్లావ్యాప్తంగా 1,056 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. రాజకీయాల్లో తొలిమెట్టుగా భావించే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార, ప్రలోభపర్వాలకు తెరలేపారు. 210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ.105 కోట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగాయి.
పంచాయతీకి ఎమ్మెల్యేలు దూరం
జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగగా స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోలేదు. మానకొండూరు, వేములవాడ, చొప్ప దండి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్ ఒకటి, రెండుసార్లు నియోజకవర్గం లోని ముఖ్య గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. మిగతా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేలు దూ రంగా ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పంచాయతీ ఎన్నికలకు దూ రంగా ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు గ్రామస్తులు ఐక్యంగా చేసుకుంటేఎమ్మెల్యే కోటాలో రూ.15లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అంతకుమించి ఆయన ఎవరు గెలిచినా నా వాళ్లే అంటూ కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం పంచాయతీ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు.
పంచాయతీ ఖరీదు రూ.105 కోట్లు
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు చాలా ఖరీదయ్యాయి. గ్రామ పంచాయతీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రలోభాలపర్వం జోరుగా సాగింది. జిల్లాలోని 210 గ్రామపంచాయతీల్లో 1,056 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేయగా.. వారంతా పోటాపోటీగా ఖర్చుపెట్టారు. సగటున చిన్న గ్రామాల్లో రూ.3లక్షలు వెచ్చించగా.. పెద్ద పంచాయతీలు, పోటీ ఎక్కువగా నెలకొన్న గ్రామాల్లో రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చీరలు పంచుతూ, సెల్‌ఫోన్లు కొనిస్తూ.. నేరుగా డబ్బులిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. ఎన్నికల సమయంలోనే సంక్రాంతి పండుగ రావడంతో.. సందర్భాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు నూనెప్యాకెట్లు, చికెన్, మద్యం బాటిళ్లను నేరుగా ఇళ్లకే పంపుతూ ఓటర్లకు అభ్యర్థులు ‘గుర్తు’ండిపోయేలా ప్రలోభాలకు గురిచేశారు. మరోవైపు యువకులకు క్రికెట్‌కిట్లు, టీషర్ట్స్, కులసంఘాలకు, ఆలయాలకు మైక్‌సెట్లు ఇస్తూ ప్రచారం సాగించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.105 కోట్ల వరకు వెచ్చించినట్లు ప్రాథమిక అంచనా..
చిలుము వదిలింది !
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్ని లక్షలు వెచ్చించాం.. ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు పూర్తవగా విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికలకు చేసిన ఖర్చులను లెక్కలేస్తుండగా ఓడిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు, వచ్చిన ఓట్లను లెక్కిస్తూ నారాజవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడంలో ప్రత్యర్థులు అనుసరించిన వ్యూహాలను సమీక్షించుకుంటున్నారు. డబ్బులతోపాటు లోపాయికారీగా జరిగిన ఒప్పందాలు, జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ పరాజితులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డుమెంబర్ సభ్యులు సైతం ఎన్నికల్లో చేసిన ఖర్చులను లెక్కలేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వార్డుసభ్యులు సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీని ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ఖరీదు రూ.వంద కోట్ల మైలురాయిని దా టడం జిల్లా చరిత్రలో తొలిసారి కావడం విశేషం.
నేతల మద్దతు కోసం విజేతలు
జిల్లాలో విజయం సాధించిన సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అధికార పార్టీ మద్దతుతో విజయం సాధించినవారు ఇప్పటికే ఎమ్మెల్యేలను కలిశారు. ఇక.. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు ఐదేళ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేనిదే వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి.
Comments
Please login to add a commentAdd a comment