మాచవరంలో పట్టుబడిన మద్యం, చీరలు(ఫైల్)
పల్లెల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికలకు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆదివారం అధికారులు గుర్తులు కేటాయించటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. గ్రామ పెద్దలను, నాయకులు, యువజన సంఘాల నాయకులను కలిసి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు విందులు, మద్యం, చీరల పంపిణీతో ఓటర్లకు గాలం వేస్తూ.. గరిష్టంగా ఈ ఎన్నికల్లో ‘లాభ’పడాలని చూస్తున్నారు.
సాక్షి, మెదక్: జిల్లాలో 469 పంచాయతీలకుగాను మొదటి విడతగా ఆరు మండలాల్లోని 154 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 32 పంచాయతీలు ఏకగ్రీమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 122 పంచాయతీల్లో 321 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,718 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 21న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు గెలుపుకోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈనెల 19వ తేదీన ప్రచారానికి తెరపడనుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో సర్పంచ్ అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. పండుగ రోజులకు తోడు అందరూ ఇళ్లలో ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను కలిసి వారి మద్దతు కోరుతున్నారు.
దీనికితోడు గ్రామాల్లో ప్రలోభాలు మొదలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి సైతం సై అంటున్నారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో గుడులు, బడులు కట్టిస్తామని హామీలు ఇస్తూ కొంత నగదు గ్రామ పెద్దలకు ముట్టుజెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే బోర్లు వేయించేందుకు హామీలు ఇస్తున్నారు.
ముఖ్యంగా కుల సంఘాల పెద్దలను కలిసి తమను గెలిస్తే అన్నిరకాలుగా అండగా ఉంటామని చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మద్యం పంపిణీ మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులు డబ్బు విషయంలో వెనకాడేది లేదని చెబుతున్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలో సర్పంచ్‌కి పోటీచేస్తున్న నేతలు మద్యం, డబ్బు పంపిణీ ప్రారంభించారు. మాచవరంలో మద్యం, చీరలు పంపిణీ చేస్తున్న ఇరువర్గాలకు చెందిన 8 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పంచాయతీ పోరులో ప్రలోభాలు ఏమేర సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించేందుకు తెరవెనక పావులు కదుపుతున్నాయి. పల్లెపోరు రసవత్తరంగా సాగుతోంది.
మండలాల్లో అభ్యర్థులు..
పెద్దశంకరంపేట మండలంలోని 22 పంచాయతీల్లో 49 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అల్లాదుర్గం మండలంలోని 14 పంచాయతీల్లో 43 మంది సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. టేక్మాల్ మండలంలోని 24 పంచాయతీల్లో 64 మంది సర్పంచ్ అభ్యర్థులు, పాపన్నపేట మండలంలోని 24 పంచాయతీల్లో 60 మంది, హవేళిఘనపూర్ మండలంలోని 21 పంచాయతీల్లో 75 మంది, రేగోడ్ మండలంలోని 17 పంచాయతీల్లో 40 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ప్రచారం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment