ప్రతీకాత్మక చిత్రం
మెదక్ రూరల్: ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కన్న కూతురిని చితకబాదుతూ ఆ తల్లి పైశాచిక ఆనందాన్ని పొందిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. హవేలిఘణాపూర్ మండలం పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కవితకు వైష్ణవి, నిత్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటు పడిన కవిత మెదక్‌లో డబ్బులు యాచిస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద కవిత మద్యం తాగడంతో పాటు తన మూడేళ్ల కూతురు నిత్యకు కూడా మద్యం తాగించి విచక్షణా రహితంగా చితకబాదింది. దీంతో తీవ్రగాయాలపాలైన చిన్నారిని చూసి చలించిన స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చిన్నారి ముఖం, తల భాగాల్లో తీవ్రగాయాలయ్యాయని సీటీ స్కాన్ చేయాలని సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సమీఉద్దీన్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి సీటీ స్కాన్ చేయించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆయన పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడేళ్ల పసిపాపను మద్యం మత్తులో కొట్టి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన తల్లిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment