కడ్తాల్‌లో పోలింగ్ కేంద్రం వద్ద మహిళల క్యూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశలోనూ గులాబీ గుబాళించింది. అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకొని తిరుగులేని అధిక్యతను సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో అన్నింట్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. తొలిదశలో కారుజోరు సాగగా.. రెండో విడతలో కూడా దుమ్ము రేపింది. ఏకంగా ఆ పార్టీ 85 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకుంది.
ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గణనీయంగా సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. తలకొండపల్లిలో ఏకంగా 24 గ్రామ సర్పంచ్ పదవులను టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకోగా.. కడ్తాల్‌లో 14, మాడ్గులలో 19 గ్రామాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 41 పల్లెలను హస్తగతం చేసుకుంది. ఆరు జీపీల్లో బీజేపీ, నాలుగు చోట్ల సీపీఎం, మూడు గ్రామాల్లో టీడీపీ విజయం సాధించింది. 12 చోట్ల స్వతంత్రులు విజయఢంకా మోగించారు. ఇదిలావుండగా, శివారు మండలాలు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. స్థిరాస్తి రంగం ప్రభావం గ్రామాలపై కనిపించడంతో సర్పంచ్, వార్డుల్లో పాగా వేసేందుకు ఇబ్బడిముబ్బడిగా నగదును వెదజల్లారు. రిజర్వ్‌డ్ స్థానాల్లో ఉప సర్పంచ్ పోస్టును కైవసం చేసుకోవడానికి రూ.లక్షలు వెచ్చించారు.
89శాతం పోలింగ్
రెండో దశ పంచాయతీ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 89శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలకుగాను 21జీపీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో మాడ్గుల మండలం ఫల్గుతండా సర్పంచ్ పదవి వివాదాస్పదమైంది. పదవిని వేలం వేశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో ప్రస్తుతానికి దీన్ని పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఈసీ నిర్ణయం వెలువరించే వరకు వేచిచూడాల్సిందే! మరోవైపు ఏకగ్రీవం పోను మిగతా 160 పంచాయతీలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠ మధ్య సాగిన కౌంటింగ్‌లో విజేతలు నిలిచిన అభ్యర్థులు విజయ దరహాసంతో ఊరేగగా.. పరాజితులు ఓటమి భారంతో వెనుదిరగడం కనిపించింది. మాడ్గుల మండలం కొల్కుల్‌పల్లిలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి విజేత వర్గీయులపై రాళ్లురువ్విన సంఘటనలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment