
సాక్షి, మెదక్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజకుంటోంది. ఆశావహులు పంచాయతీ బరిలో దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సర్పంచ్‌లతోపాటు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో యువకులు పంచాయతీ ఎన్నికల పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలు 4086 వార్డులు ఉన్నాయి. ఆయా పంచాయతీల రిజర్వేషన్లు ప్రకటించడంతోపాటు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించిన చోట ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని యువత పట్టుదలగా కనిపిస్తోంది. విద్యావంతులైన యువకులు పోటీకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకురావచ్చని యువకులు ఆలోచిస్తున్నారు. దీనికితోడు వివిధ రాజకీయ పార్టీల్లో పని చేస్తున్న యవజన నాయకులు సైతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ మద్దతుతో పంచాయతీల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని యువ నాయకులు ఎక్కువ సంఖ్యలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లోని యువ నాయకులు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడ్డారు. యువ నాయకుల పనితీరు పని తీరుపై సంతృప్తిగా ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వారిని పంచాయతీ బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తమ పార్టీలోని యువ నాయకుల పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటోంది.
మెదక్ జిల్లాలో మొత్తం 2.50 లక్షలకుపైగా యువ ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18–19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 19,940 మంది కాగా, 20 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 94,356, 30మంది ఉన్నారు. ఇక 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 1,16,434 మంది ఉన్నారు. వీరితోపాటు తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల్లో సుమారు 50వేల మంది యువ ఓటర్లు ఉన్నారు. వీరంతా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులే. గత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది యువకులు పోటీలో నిలిచారు.
తాము పుట్టిన గ్రామం బాగుపడాలన్న సంకల్పంతో విద్యావంతులు, ఉద్యోగులు సైతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ దఫా కూడా చాలా మంది యువకులు, ఉద్యోగులు, విద్యావంతులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు అయిన స్థానాల్లో విద్యావంతులైన యువకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల బరిలోకి యువత రావడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో యువత వస్తే గ్రామాలు అభివృద్ధి బాట పట్టడంతోపాటు ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment