సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా యువత పల్లె ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గిరిని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
విద్యావంతుల ఆసక్తి..
ముఖ్యంగా విద్యావంతులైన యువకులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపులో యువకులు కీలక పాత్ర పోషించారు. దీంతో జీపీ ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని ముద్దాడుతామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్‌ల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించింది. కాగా అధికార పార్టీ తరఫున ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయడానికి యువత నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వివిధ రాజకీయ పార్టీ నాయకులను కలిసి తమకే ఆయా పార్టీల నుంచి టికెట్లు వచ్చేలా సంప్రదింపులు చేస్తుంది.
పల్లెలకు పరుగులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 4.5లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. 21 సంవత్సరాలు నిండిన వారు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అర్హులు కావడంతో పైచదువుల నిమిత్తం పట్టణాల్లో ఉన్న యువత పల్లెలకు చేరుకుంటుంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సైతం తమ వృత్తికి రాజీనామా చేసి పల్లె పోరులో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాము పుట్టిన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే గొప్ప సంకల్పంతో స్వగ్రామానికి పరుగులు పెడుతున్నారు.
మచ్చిక చేసుకునే పనిలో..
సర్పంచ్‌గా పోటీలో నిలిచే యువకులు ఇప్పటికే గ్రామ పెద్దలను, ప్రజలను కలుస్తున్నారు. గ్రామంలో ఎక్కడ నలుగురు గుమిగూడి ఉంటే అక్కడికి వెళ్లి వారితో మమేకమై మాటలు కలుపుతున్నారు. ఇలా అందరిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరైతే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
మహిళా కోటలో యువతులు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 853 గ్రామాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 65, రూరల్ 199, జనగామ 150, మహబూబాబాద్ 230, జయశంకర్ భూపాలపల్లిలో 209గ్రామాలను మహిళలకు కేటాయించారు. తెలంగాణ పంచాయతీ రాజ్(ఎన్నికల నిర్వహణ) నియమావళి 2018 ప్రకారం ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
అయితే 31–5–1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న రాజకీయ నాయకులు తమ కూతుళ్లను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూతురు విద్యావంతురాలు, గ్రామాన్ని అభిృవృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రుపొందిస్తుందని ప్రచారం చేసి సర్పంచ్ గిరిని దక్కించుకోవచ్చని ముందడుగు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment