ఆదిలాబాద్‌అర్బన్: రెండోవిడత పంచాయతీకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయగా, బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా గెలుపుకోసం యత్నిస్తున్నారు. రెండోవిడత పోరుకు ఇంకా 24 గంటలే ఉంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన బూత్‌లో పోలింగ్ జరగనుంది. ఇందుకు జిల్లా యంత్రాంగం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుతోపాటు పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు పోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 400 ఓటర్లు దాటిన పోలింగ్‌కేంద్రంలో ముగ్గురు సిబ్బంది చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడత పంచాయతీ ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
రెండో విడతకు అంతారెడీ
రెండోవిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఐదు మండలాల్లోని 83 పంచాయతీలకు, 362 వార్డులకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారి చొప్పున మొత్తం 1372 మంది సిబ్బందిని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఇందులో రిజర్వులో ఉండే వారిని కలుపుకొని 580 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, 792 మందిని ఇతర ప్రిసైడింగ్ అధికారులుగా నియమించారు. ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే రిజర్వులోని సిబ్బంది విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరితోపాటు 20 మంది జోనల్, 22 మంది రూట్ అధికారులను నియమించారు. స్టేజ్–1, స్టేజ్–2 అధికారులు కలిపి మొత్తం 219 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఎన్నికలకు 1208 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, 1506 ఇంక్ బాటిళ్లు ఉన్నాయి. మొత్తం సర్పంచ్ 1,11,200 ఉండగా, 85,550 వార్డు బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి.
సర్పంచ్‌కి 306, వార్డులకు 886 మంది..
రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోథ్, తలమడుగు, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, నేరడిగొండ మండలాల్లోని మొత్తం 149 పంచాయతీలకుగాను 65 జీపీలు ఏకగ్రీవం కాగా, 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 306 మంది అభ్యర్థులు ఉన్నారు. ఐదు మండలాల్లో మొత్తం 1208 వార్డులకుగాను 839 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల బరిలో 886 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలోని బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, తలమడుగు మండలాల పరిధిలో 1,18,825 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 36,462 మంది ఉండగా, ఎస్సీలు 26,202 మంది, బీసీలు 48,076 మంది, ఇతరులు 8085 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా మొత్తం 149 పంచాయతీలు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 65 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అంటే 83 పంచాయతీలకే ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవ పంచాయతీల పరిధిలోని ఓటర్లు మినహా సుమారు 83,650 మందికిపైగా ఓటర్లు ఓటింగ్ పాల్గొనే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్..
రెండోవిడతలో 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సీన్‌ను లైవ్‌లో పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి పకడ్బందీగా ఓట్లు లెక్కించనున్నారు. కాగా ఒక పంచాయతీ సమస్యాత్మకంగా గుర్తించగా, ఐదు పంచాయతీలు అత్యంత సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. మరో 14 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 63 పంచాయతీలు సాధారణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ముగిసిన పంచాయతీ ప్రచారం..
జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. పదిరోజులుగా ఎన్నికల ప్రచారంతో సందడిగా మారిన పలు గ్రామాలు ప్రచారం ముగియడంతో స్తబ్దుగా మారాయి. ఆయా పదవులకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారంతో నిత్యం సందడి కనిపించగా, ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సౌండ్ బాక్సులు, లౌడ్ స్పీకర్లు, మైకుల సౌండ్‌తో గ్రామాలు హోరేత్తాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న వారిలో టెన్షన్ మొదలైంది. అయితే రెండోవిడత పంచాయతీ తీర్పు ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘రెండో విడత’కు సిద్ధం
Published Thu, Jan 24 2019 8:58 AM | Last Updated on Thu, Jan 24 2019 8:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment