అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు బారులు తీరిన అభ్యర్థులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశ పంచాయతీ సమరానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని 181 పంచాయతీల సర్పంచ్‌గిరీ దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా రాత్రి పొద్దుపోయేవరకు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థా నాలకు 253 నామినేషన్లు వేయగా.. 1656 వార్డు స్థానాలకు తొలిరోజు 570 మంది నామినేషన్లు సమర్పించారు. అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో ఈ నెల 25న పోలింగ్ జరుగనుంది. రాజధానికి అనుకొని ఉన్న ఈ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. అలకలు, బుజ్జగింపులు, కుల, మత, వర్గ సమీకరణలతో పల్లెపోరు ఉత్కంఠగా మారింది.
ప్రచారహోరు..
మొదటి దశ నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా కేవలం రెండు గ్రామాల సర్పంచ్ పోస్టులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు ఈ పంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం ఆఖరి గడువు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత తుది బరిలో నిలిచే అభ్యర్థుల ఎవరో తేలనుంది. ఇదిలావుండగా, నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో గ్రామాల్లో విందు, మందు, క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 21న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment