పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఊళ్లో ఉన్న ఓటర్లే కాదు, పొట్టకూటì æకోసం వలసవెళ్లిన ఓటర్లూ ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయనున్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల చూపంతా పట్నం వైపు మళ్లింది. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్న పల్లె ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో బిజీ అయ్యారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లోని పోటీదారులు హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు.
అక్కడున్న తమ గ్రామ ఓటర్లను ఒక దగ్గరకు పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. ఎన్నికల రోజు గ్రామానికి వచ్చేందుకు రవాణా చార్జీలు ముందుగానే అప్పజెప్పడంతో పాటు అవసరమైతే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వలసదారులతో పాటు యువకులు, విద్యావంతులు, ఉద్యోగులను ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరుతున్నారు. మరి వలస ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో..
సాక్షి, మెదక్: జిల్లాలోని మొదటి విడుత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో 154 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 136 పంచాయతీల్లో సర్పంచ్‌గా బరిలో ఉండేందుకు నామినేషన్లు వేశారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఎవరైనా ఉపసంహరించుకుంటే ఆ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగితా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వందకుపైగా పంచాయతీల్లో పోటీ ఉండే అవకాశం ఉంది. 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవికిపోటీ పడుతున్న నాయకులు ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో జరగనున్నాయి. రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లో వలసలు ఎక్కువగా ఉంటాయి. పాపన్నపేట, హవేళిఘనపూర్ మండలాల్లో వలసలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వలసవెళ్లిన వారు ఐదు నుంచి ఆరువేల మంది ఉంటారు. ఎక్కువ మంది హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి కూలీ, పరిశ్రమల్లో కార్మికులు, దుకాణాలు, మాల్స్, అపార్ట్స్‌మెంట్‌లో పనిచేస్తుంటారు.
అలాగే కొంత మంది ఆటోలు నడుపుతున్నారు. మరికొంత మంది చెరుకుబళ్లు నడుపుతుంటారు. ఉపాధి కోసం పట్నంలో ఉన్నప్పటికీ వీరి ఓట్లు మాత్రం స్వగ్రామాల్లోనే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో గ్రామానికి వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో సర్పంచ్ అభ్యర్తుల దృష్టి వలస ఓటర్లపై పడింది. వారి మద్దతుకూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రతి గ్రామంలో వేల సంఖ్యలో..
పెద్దశంకరంపేట మండలంలోని మక్తలక్ష్మాపూర్, చీలపల్లి, బూర్గుపల్లి, వీరోజుపల్లి, జూకల్, కట్టెల వెంకటాపూర్ గ్రామాలకు చెందిన సుమారు ఐదువేల మంది బీరంగూడ, కూకట్‌పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పనిచేస్తూంటారు. ఆయా గ్రామాల నుంచి సర్పంచ్‌గా పోటీపడుతున్న నాయకులు రెండు రోజులుగా హైదరాబాద్ వెళ్లి వీరిని కలిసి మద్దతు కోరుతున్నారు. ఎన్నికల రోజు స్వగ్రామం వచ్చేందుకు వాహనాలు పెడుతున్నారు. అలాగే పోటా పోటీగా ఖర్చులకు డబ్బులు అప్పజెబుతూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. టేక్మాల్ మండలంలోని పల్వంచ, కాదులూరు, ఎల్లుపేట, ఎల్లంపల్లితాండ, అచ్చన్నపల్లి, టేక్మాల్, తంపులూరు చెందిన సుమారు 6వేల మంది హైదరాబాద్‌లోని బోయినిపల్లి చుట్టు పక్కల పనులు చేసుకుంటున్నారు. గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు వలస ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు.
అల్లాదుర్గం మండలంలోని అప్పాజిపల్లి, రాంపూర్, కాయిగితంపల్లి, ముప్పారంతండా, చిల్వెర, బైరన్‌దిబ్బ, ముస్తాపూర్, మాందాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు కూకట్‌పల్లి, బాల్‌నగర్ ఏరియా , పటాన్‌చెరు ప్రాంతాల్లోని పరిశ్రమలు పనిచేస్తున్నారు. పాపన్నపేట మండలం కొంపల్లి, కొడుపాక, డాక్యాతండా, లింగాయిపల్లి, గాజులగూడెం, పాపన్నపేట, కందిపల్లి, గోదూరు గ్రామాల నుంచి వలసలు వెళ్లిన ఓటర్లు ఉన్నారు. రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి, రేగోడ్, సంగమేశ్వర్‌తండా, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల, చౌదరిపల్లి, గజ్వాడ గ్రామాలకు చెందిన సుమారు 3వేల మందికిపైగా ఓటర్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరి ఓట్ల కోసం ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఆరు మండలాల నుంచి ఉన్నతవిద్య కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యుకువలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని, వ్యాపారస్తులను సైతం సర్పంచ్ పోటీదారులు కలిసి వారి మద్దతు కోరుతున్నారు. అయితే పట్నంలో ఉంటున్న పల్లె ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment