ఎన్నికల విధులు పాల్గొన్న బీఎల్‌ఓలతో కలెక్టర్ రొనాల్డ్ రోస్ (ఫైల్)
మహబూబ్‌నగర్ రూరల్ : శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా తయారీ, అనర్హుల ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు లాంటి కీలక పనులు చేసిన బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌ఓ) శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. బీఎల్‌ఓలుగా వి«ధులు నిర్వర్తించిన అంగన్‌వాడీ టీచర్లకు మూడేళ్లకు సంబంధించి గౌరవ వేతనం అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో విధులు నిర్వహించిన బీఎల్‌ఓలకు నెలకు రూ.500 చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూడేళ్లుగా ఓటరు జాబితా ప్రక్రియలో భాగస్వామ్యమై రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన అంగన్‌వాడీ టీచర్లకు నిబంధనల ప్రకారం రావాల్సిన గౌరవ వేతనం చెల్లించకపోవడంతో వారు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
మూడేళ్ల నుంచి రూపాయి రాలే...
గడిచిన 2016, 2017తో పాటు 2018లో ఓటర్ల జాబితా తయారీ, స్పెషల్ సమ్మరీ రివిజన్, అనర్హుల ఓట్ల తొలగింపు వంటి పనులు చేసేందుకు బీఎల్‌ఓలుగా అంగన్‌వాడీ టీచర్లను వినియోగించుకున్నారు. జిల్లాలో 360 మంది సేవలు ఉపయోగించుకోగా.. ఒక్క మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోనే 263 మంది ఉన్నారు. వీరందరికీ ఏడాదికి కనీస గౌరవ వేతనం రూ.7వేల చొప్పున మూడేళ్లకు గాను రూ.21వేలు రావాల్సి ఉంది.
ఇలా ఒక్కొక్కరికి రూ. 21వేల చొప్పున బకాయి ఉండగా జిల్లా మొత్తంలో 360 మందికి రూ.75.60లక్షలు అందాల్సి ఉంది. ఇన్నేళ్లుగా పెంచింగ్‌లో ఉన్న గౌరవ వేతనాన్ని చెల్లించకపోగా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరి సేవలు వినియోగించుకున్నారు. ఇక తాజా గ్రామపంచాయతీ ఎన్నికల విధులు కూడా నిర్వర్తించాలని సూచించగా.. మూడేళ్ల నుంచి గౌరవం వేతనం ఇవ్వకపోవడంతో పలువురు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలను బీఎల్‌ఓలు సంప్రదించగా ప్రభుత్వం ని«ధులు విడుదలైన వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారని వాపోతున్నారు.
అసలే అంతంత..
అంగన్‌వాడీ టీచర్లకు అంతంత మాత్రంగానే వేతనాలు అందుతున్నాయి. అటు కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించే కేంద్రాల నిర్వహణలో నిమగ్నమయ్యే వీరికి తరచూ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇందులో బూత్ లెవల్ అధికారుల విధులు ఒకటి. ఈ మేరకు కేంద్రాల నిర్వహణను ఆయాలకు అప్పగించినా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూస్తూనే ఇటు ఇతర విధుల్లో పాల్గొంటున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తామన్న కనీస గౌరవ వేతనాన్ని ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెండింగ్ బిల్లుల విషయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నా ఇంత వరకు వేతనాలు అందలేదు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున ఈ బాధ్యతలను కూడా వారికే అప్పగిస్తుండగా.. తొలుత పెండింగ్ వేతనాలు చెల్లించాకే విధుల్లో చేరుతామని పలువురు బీఎల్‌ఓలు స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల బడ్జెట్‌పై అనుమానాలు
2018 శాసనసభ ఎన్నికలకు సంబం«ధించి విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సంబంధించి విడుదలైన బడ్జెట్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్‌ఓలుగా విధులు నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్లకు మూడేళ్లుగా బకాయి ఉన్న గౌరవ వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం మూడు నెలల బకాయిలు చెల్లిస్తామని అధికారులు చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి ఎన్నికల్లో పని చేసిన సిబ్బందికి వచ్చిన బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంతనే వివరాలు అధికారులకు తెలియాలి. కానీ అలా చెప్పకుండా కేవలం మూడు నెలల వేతనాలను బీఎల్‌ఓలకు చెల్లిస్తామని చెబుతుండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలల బకాయిలు చెల్లిస్తాం
శాసనసభ ఎన్నికల్లో భాగంగా బీఎల్‌ఓలుగా విధులు నిర్వర్తించిన అంగన్‌వాడీ టీచర్లకు మూడు నెలల పెండింగ్ బకాయిలను చెల్లిస్తాం. బీఎల్‌ఓలు గత మూడేళ్లుగా విధులు నిర్వహించిన బకాయిలు అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. కేవలం మూడు నెలల గౌరవ వేతనం చెల్లించడం వరకే మా పరిధిలో ఉంటుంది. – వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్‌నగర్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment