అస్తవ్యస్తం.. | Telangana Panchayat Second Phase Elections | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తం..

Published Fri, Jan 25 2019 7:12 AM | Last Updated on Fri, Jan 25 2019 7:12 AM

Telangana Panchayat Second Phase Elections - Sakshi

సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇక స్థానిక సంస్థల్లో అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరింత పకడ్బందీగా ఉండాలి. అయితే గతంతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరగడంతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరం వచ్చింది. పైగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే అన్ని అంశాల్లో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ.. సిబ్బందికి విధుల కేటాయింపులో మాత్రం జిల్లాలో అనేక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సగం మందికి ఎన్నికల డ్యూటీ పడకపోగా వందల మంది ప్రైవేటు టీచర్లకు విధులు అప్పగించారు.

దీంతో ఏదైనా సమస్య తలెత్తితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న బాధ్యత ప్రైవేటు వారికి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలకుంటే ప్రైవేటు వారి సేవలు ఉపయోగించుకోవాలే తప్ప ఇలా చేయడమేంటని అంటున్నారు. మరో విషయమేంటంటే చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డ్యూటీలు పడకపోగా, ప్రస్తుతంజరుగుతున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క విడతలోనూ సదరు టీచర్లకు విధులు కేటాయించకపోవడం గమనార్హం.

ఇక కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రం మూడు విడతల్లోనూ విధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 4500 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 2వేల మందికి అసలు ఎన్నికలు డ్యూటీలే వేయకపోవడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొందరు ఉపాధ్యాయులైతే తాము ఎన్నికల విధులకు పనికి రామా అని వాపోతున్నారు. అలాగే చాలామంది ఎస్జీటీలకు ఎన్నికల విధులు పడకపోగా, కీలకమైన పదోతరగతి విద్యార్థులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రం మూడు విడతల్లో విధులు కేటాయించడం గమనార్హం.

రిటైర్డ్‌ ఉపాధ్యాయులకూ విధులు..! 
కొందరు రిటైర్డ్‌ ఉపాధ్యాయులకు, ఇతర జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించారు. కొందరు వికలాంగ ఉద్యోగులకు కూడా విధులు కేటాయించడంతో, వారు సంబంధిత జీవో కాపీలు తెచ్చుకుని డీపీఓ వద్దకు వెళ్లి డ్యూటీలు రద్దు చేయించుకున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో అనేకమంది అంగన్‌వాడీ టీచర్లకు ఎన్నికల డ్యూటీలు వేశారు. చివరకు కాంట్రాక్టు లెక్చరర్లు, సింగరేణి ఉద్యోగులు, ఐటీడీఏ ఉద్యోగులకు సైతం విధులు కేటాయించి తమను విస్మరించడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు మథనపడుతున్నారు.
  
టీ– పోల్‌ వెబ్‌సైట్‌తోనే అసలు తిప్పలు.. 
రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందరు ఎంపీడీఓలు ఆయా మండలాల పరిధిలోని ఉద్యోగుల వివరాలు ఇచ్చారు. వారు టీ.పోల్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ టీ.పోల్‌ ద్వారా మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు ఉద్యోగుల వివరాలు తీసుకుని విడతల వారీగా ఎన్నికల విధులు కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నం కాగా, వాటిని జిల్లా పంచాయతీ అధికారి సాధ్యమైనంత మేరకు సవరించారు. అలాగే ఉపాధ్యాయులు వివిధ సమస్యలను డీపీఓ దృష్టికి తీసుకురాగా వాటిని సైతం సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికలు జరిగిన అన్ని మండలాల్లో ఎన్నికల సిబ్బంది కొరత తలెత్తినప్పటికీ నెట్టుకొచ్చారు. రెండో విడతలో అలాంటి సమస్యలు రాకుండా డీపీఓ సరిచేశారు. ఉద్యోగుల వివరాలను ఎంపీడీఓలు ఆయా మండలాల నుంచి టి.పోల్‌ వెబ్‌సైట్‌కు పంపారు.

అయితే ఉపాధ్యాయుల వివరాలను, రిటైర్డ్‌ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓల నుంచి ఎంపీడీఓలు తీసుకున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన కచ్చితమైన వివరాలను ఎంఈఓలు సక్రమంగా ఇవ్వలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎంపీడీఓలు తమకు అందిన వివరాలను మాత్రమే పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పంచాయతీ అధికారులకు సమస్యలు ఎదురైనట్లు పలువురు ఉపాధ్యాయులు చెపుతున్నారు.

రెమ్యునరేషన్‌లోనూ తేడాలు..  
 ఎన్నికల విధులకు హాజరైన వివిధ స్థాయిల సిబ్బందికి రెమ్యునరేషన్‌ ఇచ్చే విషయంలోనూ ఒక విధానమంటూ లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒక రకంగా చెల్లించారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ చెల్లింపు విషయంలో ఆయా విభాగాల వారీగా సిబ్బందికి అన్ని చోట్లా ఒకేలా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టరుకు వినతిపత్రాలు అందించాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో ఆయా మండల కేంద్రాల వద్ద నుంచి అర్ధరాత్రి సమయంలో రవాణా సదుపాయాలు లేక సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేక అగచాట్లు పడ్డారు. రెండు, మూడు విడతల్లో అయినా ఈ పరిస్థితిని లేకుండా చేయాలని కోరుతున్నారు. 

ఎంఈఓలు అన్ని వివరాలు ఇచ్చారు 
అన్ని మండలాల్లో ఆయా ఉపాధ్యాయులకు సంబంధించిన పూర్తి వివరాలను మండల విద్యాశాఖ అధికారులు ఎంపీడీఓలకు అందజేశారు. అయితే ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు కేటాయించకపోవడం, ఉద్యోగ విరమణ పొందిన వారికి  ఎన్నికల విధులు కేటాయింపు విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు.  – వాసంతి, డీఈఓ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement