రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఇలా..
చుంచుపల్లి: జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత ఎన్నికల తంతు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జిల్లాలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దశలో 142 పంచాయతీలు, 1294 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
మలిదశ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత పంచాయతీల వారీగా స్థానికంగానే నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా పంచాయతీల పరిధిలో మూడు రోజుల పాటు స్థానికంగా అందుబా టులో ఉండి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, నామినేషన్లు తిరస్కరణ, ఉపసంహరణ, తదితర పనులను చేపట్టి 17న రెండో విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు.
రెండో విడతలో 142 పంచాయతీల్లో..
మొదటి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, రెండో దశలో మరో ఏడు మండలాల పరిధిలోని 142 పంచాయతీలు, 1294 వార్డులకు ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందులో అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 పంచాయతీలు ఉండగా 16, 519 మంది ఓటర్లు, అశ్వారావుపేటలో 30 పంచాయతీల పరిధిలోని 41,3179 మంది, చండ్రుగొండలో 14 పంచాయతీల్లో 21,795 మంది, చుంచుపల్లిలో 18 పంచాయతీల పరిధిలో 33,462 మంది, దమ్మపేటలో 31 పంచాయతీల్లో 40,729 మంది, కరకగూడెంలో 16 పంచాయతీల్లో 11,184 మంది, పినపాకలో 23 పంచాయతీల పరిధిలోని 23,712 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 25న 142 పంచాయతీలు 1294 వార్డులకు పోలింగ్ జరగనుంది.
సమస్యాత్మక గ్రామాలు 520..
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 479 పంచాయతీలకు మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో జిల్లాలో 520 గ్రామాలు సమస్యాత్మక, 876 గ్రామాలు అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ రోజున ఏ మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలనే విషయమై పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో అవసరమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో వెబ్‌కాస్టింగ్ కోసం కూడా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment