సర్వం సిద్ధం | Telangana Panchayat Second Phase Elections Arrangements Complaints | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Fri, Jan 25 2019 7:29 AM | Last Updated on Fri, Jan 25 2019 7:29 AM

Telangana Panchayat Second Phase Elections Arrangements Complaints - Sakshi

కొత్తగూడెంలోని సింగరేణి పాఠశాల నుంచి ఎన్నికల విధులకు తరలుతున్న సిబ్బంది

చుంచుపల్లి:  రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్‌ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో వార్డు సభ్యులు హాజరు కాకుంటే ఉప సర్పంచ్‌ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఎన్నికలు జరిగే  అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, చుంచుపల్లి మండలాలకు అధికార యంత్రాంగం, పోలింగ్, పోలీస్‌ సిబ్బంది గురువారం మధ్యాహ్నానికే ఆయా కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా పోలీసు బందోబస్తుతో పాటు, పలు పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండో విడతలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1294 వార్డులకు గాను ఐదింటికి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 289 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1000 వార్డులకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఇక ఎన్నికలు జరిగే 122 పంచాయతీలకు 343 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 1000 వార్డులకు మొత్తం 2,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

సిబ్బంది, సామగ్రి తరలింపునకు 100 బస్సులు... 
రెండో విడత ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, పోలింగ్‌ సామగ్రిని తరలించేందుకు 100 బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 పెద్ద బస్సులు, 25 మినీ బస్సులు ఉన్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి ఈ బస్సుల్లోనే సిబ్బంది, సామగ్రిని  గమ్యస్థానాలకు చేరుస్తారు. కాగా, రెండో విడత ఎన్నికల విధులకు 3,423 మంది పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఆర్వోలు 43 మంది, ఆర్వో– 1, 43 మంది, ఏఆర్‌వోలు 156, పీవోలు 1,423,  ఓపిఓలు 1,657 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్‌ ఆఫీసర్లు 77 మంది, జోనల్‌ ఆఫీసర్లను 25 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్‌ కోసం 4లక్షల బ్యాలెట్‌ పత్రాలు, 1,455 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నారు.
 
సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్‌  
రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. రెండో విడత ఎన్నికలకు పోలింగ్‌ సామగ్రిని తరలించే సింగరేణి పాఠశాల కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా మండలాల అధికారులకు సూచించారు. తొలి విడత ఎన్నికల సమయంలో అక్కడక్కడా కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు భోజనాలతో పాటు ఇతర సౌకర్యాలను స్థానిక మండల అధికారులు ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జేసీ వెంకటేశ్వర్లు, డీపీఓ ఆశాలత, ఎన్నికల విభాగం అధికారులు ముత్యాల పులిరాజు, కోటయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, చుంచుపల్లి తహసీల్దార్‌ నాగుబాయి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement