వరించి వచ్చింది.. సర్పంచ్‌ కానుంది.. | A Woman Get Jackpot Offer In Panchayat Elections In Telangana | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 4:29 PM | Last Updated on Sat, Jan 5 2019 4:31 PM

A Woman Get Jackpot Offer In Panchayat Elections In Telangana - Sakshi

గోవిందరావుపేట : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ గ్రామం ఏజన్సీ పరిధిలో ఉంది.. కానీ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు.. కొద్దినెలల క్రితం గ్రామానికి చెందిన యువకుడు ఎస్టీ యువతి బానోతు లల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామంలో కాపురానికి తీసుకురాగా ప్రియుడిని వరించి వచ్చిన ఆ యువతి నేడు సర్పంచ్‌ పీఠం ఎక్కనుంది. గోవిందరావుపేటలోని కోటగడ్డ గ్రామాన్ని ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా గుర్తించింది. గతంలో లక్నవరం(దుంపెల్లిగూడెం) గ్రామపంచాయతీలో భాగమైన కోటగడ్డకు సంబంధించిన వార్డు సభ్యులలో ఎస్టీ రిజర్వేషన్‌ వస్తే దుంపెల్లిగూడెంకు చెందిన వారే పోటీ చేసేవారు. గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయగా ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడం గమనార్హం.

ప్రేమించి ప్రియుడితో వచ్చిన ఎస్టీ యువతి
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్‌ గ్రామానికి బానోతు సోమ్లా, లక్ష్మిల ఏడుగురు సంతానంలో ఐదో సంతానమైన లల్లి గతేడాది వేములవాడకు వచ్చిన క్రమంలో కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్‌కుమార్‌ దైవదర్శనానికి వచ్చి పరిచయమయ్యాడు. ఇరువురి మనసులు కలిసి వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుని గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. తల్లి పూర్తిగా అంగీకారం తెలుపకపోయినా ప్రియుడిని నమ్మి అతడి వెంట కోటగడ్డకు వచ్చి పూరిగుడిసెలో కాపురముంటుంది. ఈ క్రమంలో కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పడడం, గ్రామంలో ఆమె ఒక్కతే ఎస్టీ మహిళ ఉండడంతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది.

వార్డు సభ్యులకు తిప్పలే..
ఏజన్సీ గ్రామపంచాయతీ కావడంతో గ్రామంలో మొత్తం  ఆరు వార్డులకు గాను మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. అయితే గ్రామంలో మరో ఎస్టీ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

అదృష్టం కలిసి వచ్చింది..
మా ఇద్దరి మధ్య ప్రేమతో పెళ్లి చేసుకుని కోటగడ్డకు అత్తగారింటికి వచ్చాను. ఎస్సెస్సీ వరకు చదువుకున్నాను. ఇక్కడ రిజర్వేషన్‌ వల్ల అదృష్టం కలిసి వచ్చింది. గ్రామ పెద్దలు వచ్చి విషయం చెప్పారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ పెద్దలతో కలిసి గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం.
– బానోతు లల్లి, కోటగడ్డ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement