Panchayat reservations
-
వరించి వచ్చింది.. సర్పంచ్ కానుంది..
గోవిందరావుపేట : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ గ్రామం ఏజన్సీ పరిధిలో ఉంది.. కానీ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు.. కొద్దినెలల క్రితం గ్రామానికి చెందిన యువకుడు ఎస్టీ యువతి బానోతు లల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామంలో కాపురానికి తీసుకురాగా ప్రియుడిని వరించి వచ్చిన ఆ యువతి నేడు సర్పంచ్ పీఠం ఎక్కనుంది. గోవిందరావుపేటలోని కోటగడ్డ గ్రామాన్ని ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా గుర్తించింది. గతంలో లక్నవరం(దుంపెల్లిగూడెం) గ్రామపంచాయతీలో భాగమైన కోటగడ్డకు సంబంధించిన వార్డు సభ్యులలో ఎస్టీ రిజర్వేషన్ వస్తే దుంపెల్లిగూడెంకు చెందిన వారే పోటీ చేసేవారు. గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయగా ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడం గమనార్హం. ప్రేమించి ప్రియుడితో వచ్చిన ఎస్టీ యువతి జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్ గ్రామానికి బానోతు సోమ్లా, లక్ష్మిల ఏడుగురు సంతానంలో ఐదో సంతానమైన లల్లి గతేడాది వేములవాడకు వచ్చిన క్రమంలో కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్‌కుమార్ దైవదర్శనానికి వచ్చి పరిచయమయ్యాడు. ఇరువురి మనసులు కలిసి వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుని గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. తల్లి పూర్తిగా అంగీకారం తెలుపకపోయినా ప్రియుడిని నమ్మి అతడి వెంట కోటగడ్డకు వచ్చి పూరిగుడిసెలో కాపురముంటుంది. ఈ క్రమంలో కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పడడం, గ్రామంలో ఆమె ఒక్కతే ఎస్టీ మహిళ ఉండడంతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. వార్డు సభ్యులకు తిప్పలే.. ఏజన్సీ గ్రామపంచాయతీ కావడంతో గ్రామంలో మొత్తం ఆరు వార్డులకు గాను మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. అయితే గ్రామంలో మరో ఎస్టీ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అదృష్టం కలిసి వచ్చింది.. మా ఇద్దరి మధ్య ప్రేమతో పెళ్లి చేసుకుని కోటగడ్డకు అత్తగారింటికి వచ్చాను. ఎస్సెస్సీ వరకు చదువుకున్నాను. ఇక్కడ రిజర్వేషన్ వల్ల అదృష్టం కలిసి వచ్చింది. గ్రామ పెద్దలు వచ్చి విషయం చెప్పారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ పెద్దలతో కలిసి గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం. – బానోతు లల్లి, కోటగడ్డ -
‘పంచాయతీ’పై రాద్ధాంతం ఎందుకు?: కరుణాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లున్నాయని, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరగకుండా ఓసీలు అత్యధిక జనాభా ఉన్న గ్రామాలను ఇతర వర్గాలకు కేటాయించకుండా జనరల్ స్థానాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, విశ్వేశ్వర్, ప్రవీణ్ కుమార్, విజయానంద్ పాల్గొన్నారు -
పంచాయతీ రిజర్వేషన్లు మొదటికి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త రాష్ట్రం కావడం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొదటికి రానుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 1995లో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. జనాభా ఆధారంగా మండలం యూనిట్‌గా ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ,బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా కేటగిరీలు ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో అన్ని కేటగిరీలు వర్తింపజేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాలకు నాలుగు రకాల రిజర్వేషన్లు వర్తింపజేశారు. మిగతా నాలుగు కేటగిరీలను వంతుల వారీగా అమలు చేయాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావడంతో గ్రామాల్లో ఇప్పటికే అమలైన రిజర్వేషన్లు మళ్లీ ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఖరారయ్యే రిజర్వేషన్ కేటగిరీలు వరుసగా రెండు ఎన్నికలకు వర్తిస్తాయి. జూన్ నుంచి ఖరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ జూన్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోంది. మే 17న ఓటర్ల తుది జాబితాను అన్ని పంచాయతీలలో ప్రదర్శించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా బీసీ ఓటర్ల గణన జరగనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మే 18 నుంచి ఇది మొదలై రెండు వారాలపాటు కొనసాగనుంది. జూన్ 3 కల్లా పూర్తయ్యే అకాశం ఉంది. అనంతరం వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. -
కోర్టులు తప్ప మమ్మల్నెవరూ ఆదేశించలేరు!: రమాకాంత్‌రెడ్డి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి స్థానిక ఎన్నికల జాప్యానికి బాధ్యులెవరు? పలుమార్లు అడిగినా సర్కారు పంచాయతీ రిజర్వేషన్లు ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎన్నికలంటే చట్టం అంగీకరించదు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయస్థానాలు మినహా తమను ఎవరూ ఆదేశించలేరని, కోర్టుల ఆదేశాలు మాత్రమే తాము పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని.. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం వేర్వేరుగా అధికారాలు కల్పించిందని పేర్కొన్నారు. ఆయన శనివారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. సాధారణ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశమే అయినా.. అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ, స్పందించలేదని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు) చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు నిర్వహించడం అంటే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కమిషనర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, పంచాయతీ అధికారులు, పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయం తమకు కూడా తెలుసన్నారు. కానీ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. అందుకు చట్టం ఒప్పుకోదు.. పంచాయతీ సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మేలో ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారని, కానీ ఇందుకు చట్టం ఒప్పుకోదని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నాలుగు నుంచి పది రోజుల్లోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఆ తర్వాత మూడు రోజులపాటు నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారానికి వారం రోజులు గడువు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ల ఎన్నిక కార్యక్రమాలన్నింటినీ నోటిఫికేషన్లోనే ఏయే సమయంలో ఏమేమి చేయాలన్న తేదీలతో సహా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు నిలుపుదల చేయడానికి కూడా వీల్లేదన్నారు. ఎన్నికల ఫలితాలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆదేశించడం లేదా సూచించడానికీ వీల్లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొన్నారు. కేవలం న్యాయస్థానాలకు మాత్రమే తమను ఆదేశించడానికి అధికారం ఉందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలను 28 రాష్ట్రాల్లో నిర్వహిస్తుందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి నోటిఫికేషన్ జారీ చేస్తుందని, కానీ తమకు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రం మొత్తానికి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
ఏప్రిల్ 6న పంచాయతీ పోరు!
-
ఏప్రిల్ 6న పంచాయతీ పోరు!
* రేపు నోటిఫికేషన్? * జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల గెజిట్లు సిద్ధం * శనివారానికల్లా జిల్లా పరిషత్, మండల పరిషత్ కోటా ఖరారు! * రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు * జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ, మండలం యూనిట్‌గా ఎంపీటీసీ.. సాక్షి, హైదరాబాద్: పంచాయతీ పిడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ తదితర అధికారులతో సమావేశమయ్యూరు. రిజర్వేషన్లను ఎప్పటిలోగా అందిస్తారో తెలపాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏడెనిమిది జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లు అందగానే జెడ్పీ, మండల రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రిజర్వేషన్ల జాబితా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో.. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 6 (ఆదివారం) అనువైన తేదీగా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. పరీక్షల ఇబ్బందుల దృష్ట్యానే మున్సిపల్ ఎన్నికలను సైతం మార్చి 30న (ఆదివారం) నిర్వహిస్తున్న విషయం విదితమే. పంచాయతీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు (ఈవీఎంలు) ఉపయోగించేందుకు అవకాశం లేదు. అందువల్ల బ్యాలెట్ పేపర్లనే వినియోగించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు చాలా అధిక సంఖ్యలో ఈవీఎంలు అవసరమవుతారుు. అంత భారీ సంఖ్యలో ఈవీఎంలు ప్రస్తుతం అందుబాటులో లేవు. పైగా మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తున్నందున సాంకేతిక కారణాల దృష్ట్యా కూడా వీటిని పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించే వీల్లేదని సమాచారం. మరోవైపు బ్యాలెట్ బాక్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ పంచాయతీ రిజర్వేషన్ల విధానం.. * జెడ్పీ చైర్పర్సన్లు, మండల పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయిస్తారు. * రాజ్యాంగం ప్రకారం జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 18.88%, ఎస్టీలకు 9.15% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఇక బీసీలకు జనాభాతో సంబంధం లేకుండా 34% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పంచాయతీరాజ్ వర్గాలు వివరించాయి. ఇక అన్నింటిలోనూ తొలిసారిగా మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేయనున్నారు. * తాజా జనాభా లెక్కల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని 62.03 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు ఇది 60.5 శాతమే. హా జెడ్పీ చైర్పర్సన్లలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు, అన్రిజర్వ్డ్ కింద తొమ్మిది స్థానాలుగా నిర్ణయించినట్లు సమాచారం. అన్ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు (50% కింద) నాలుగు స్థానాలు రిజర్వ్ కానున్నాయి. * మండల పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించినా, ఏ మండలం ఎవరికి రిజర్వ్ అవుతుందన్న విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించకుండా.. ఆయా జిల్లాల జనాభా లెక్కల ఆధారంగా సంఖ్యను మాత్రమే ఖరారు చేసి జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సంఖ్యతో ఆయా జిల్లాలోని జనాభా ఆధారంగా కలెక్టర్లు మండల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఎంపీటీసీల రిజర్వేషన్లు మండల యూనిట్‌గా ఆయూ జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. ‘పీసా’ చట్టం కింద 49 ఎంపీపీలు ఎస్టీలకే: ‘పీసా’(పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా) చట్టం ప్రకారం ఏజెన్సీలోని మండల పరిషత్‌ల చైర్పర్సన్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మధ్య కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1096 మండల పరిషత్‌లు ఉన్నారుు. వీటిలో 49 మండల పరిషత్‌లు ఏజెన్సీ (షెడ్యూల్డ్) ప్రాంతంలో ఉన్నారుు. వీటిని ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగిలే 1047 నాన్ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలోనూ తిరిగి ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎస్టీలకు (49+73) మొత్తం 122, ఎస్సీలకు 202, బీసీలకు 356 స్థానాలు రిజర్వ్ కాగా మిగిలిన 416 అన్ రిజర్వ్డ్ స్థానాలు. (వీటిలోనూ మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుంది) నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో రిజర్వేషన్ల శాతం... ఎస్టీలు 6.99%; ఎస్సీలు 19.32%; బీసీలు 34% ఓటర్ల జాబితాలు ప్రకటించండి ఎన్నికల సంఘం: ఈ నెల 10వ తేదీ నాటికి తాజా ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజాగా ప్రచురించిన ఫోటోలున్న ఓటర్ల జాబితాను వినియోగించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించారు. మున్సిపోల్స్‌కు ముందు మద్యం బంద్: ఉత్తర్వులు జారీ మున్సిపల్ ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే 146 మున్సిపాలిటీలు, పది మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలు వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇలావుండగా ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి చెందిన గుర్తింపు చిహ్నాలు వాడడానికి వీల్లేదని తెలిపారు. వాహనాలపైనే కాకుండా ఇంటిపైన, ఆస్తులకు సంబంధించిన వాటిలో పార్టీలతో ప్రమేయం కానీ, వాటి చిహ్నాలు కానీ ఉంచరాదని స్పష్టం చేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం మినహా మరే విధంగానూ తమ విధానాన్ని బయట పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చూశాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతి కానీ, తమ న్యాయవాది నివేదిక కానీ వచ్చాక ఒక నిర్ణయానికి వస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల జాబితాను ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. - రమాకాంత్‌రెడ్డి