
ఏప్రిల్ 6న పంచాయతీ పోరు!
* రేపు నోటిఫికేషన్?
* జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల గెజిట్‌లు సిద్ధం
* శనివారానికల్లా జిల్లా పరిషత్, మండల పరిషత్ కోటా ఖరారు!
* రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు
* జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ, మండలం యూనిట్‌గా ఎంపీటీసీ..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ పిడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు, జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ చైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ తదితర అధికారులతో సమావేశమయ్యూరు.
రిజర్వేషన్లను ఎప్పటిలోగా అందిస్తారో తెలపాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏడెనిమిది జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌లు అందగానే జెడ్పీ, మండల రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రిజర్వేషన్ల జాబితా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో.. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 6 (ఆదివారం) అనువైన తేదీగా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. పరీక్షల ఇబ్బందుల దృష్ట్యానే మున్సిపల్ ఎన్నికలను సైతం మార్చి 30న (ఆదివారం) నిర్వహిస్తున్న విషయం విదితమే. పంచాయతీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు (ఈవీఎంలు) ఉపయోగించేందుకు అవకాశం లేదు. అందువల్ల బ్యాలెట్ పేపర్లనే వినియోగించనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు చాలా అధిక సంఖ్యలో ఈవీఎంలు అవసరమవుతారుు. అంత భారీ సంఖ్యలో ఈవీఎంలు ప్రస్తుతం అందుబాటులో లేవు. పైగా మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తున్నందున సాంకేతిక కారణాల దృష్ట్యా కూడా వీటిని పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించే వీల్లేదని సమాచారం. మరోవైపు బ్యాలెట్ బాక్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ పంచాయతీ రిజర్వేషన్ల విధానం..
* జెడ్పీ చైర్‌పర్సన్లు, మండల పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయిస్తారు.
* రాజ్యాంగం ప్రకారం జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 18.88%, ఎస్టీలకు 9.15% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఇక బీసీలకు జనాభాతో సంబంధం లేకుండా 34% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పంచాయతీరాజ్ వర్గాలు వివరించాయి. ఇక అన్నింటిలోనూ తొలిసారిగా మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేయనున్నారు.
* తాజా జనాభా లెక్కల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని 62.03 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు ఇది 60.5 శాతమే.
హా జెడ్పీ చైర్‌పర్సన్లలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు, అన్‌రిజర్వ్‌డ్ కింద తొమ్మిది స్థానాలుగా నిర్ణయించినట్లు సమాచారం. అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో మహిళలకు (50% కింద) నాలుగు స్థానాలు రిజర్వ్ కానున్నాయి.
* మండల పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించినా, ఏ మండలం ఎవరికి రిజర్వ్ అవుతుందన్న విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించకుండా.. ఆయా జిల్లాల జనాభా లెక్కల ఆధారంగా సంఖ్యను మాత్రమే ఖరారు చేసి జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సంఖ్యతో ఆయా జిల్లాలోని జనాభా ఆధారంగా కలెక్టర్లు మండల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఎంపీటీసీల రిజర్వేషన్లు మండల యూనిట్‌గా ఆయూ జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు.
‘పీసా’ చట్టం కింద 49 ఎంపీపీలు ఎస్టీలకే: ‘పీసా’(పంచాయత్స్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా) చట్టం ప్రకారం ఏజెన్సీలోని మండల పరిషత్‌ల చైర్‌పర్సన్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మధ్య కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1096 మండల పరిషత్‌లు ఉన్నారుు. వీటిలో 49 మండల పరిషత్‌లు ఏజెన్సీ (షెడ్యూల్డ్) ప్రాంతంలో ఉన్నారుు.
వీటిని ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగిలే 1047 నాన్ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలోనూ తిరిగి ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎస్టీలకు (49+73) మొత్తం 122, ఎస్సీలకు 202, బీసీలకు 356 స్థానాలు రిజర్వ్ కాగా మిగిలిన 416 అన్ రిజర్వ్‌డ్ స్థానాలు. (వీటిలోనూ మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుంది)
నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో రిజర్వేషన్ల శాతం...
ఎస్టీలు 6.99%; ఎస్సీలు 19.32%; బీసీలు 34%
ఓటర్ల జాబితాలు ప్రకటించండి
ఎన్నికల సంఘం: ఈ నెల 10వ తేదీ నాటికి తాజా ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజాగా ప్రచురించిన ఫోటోలున్న ఓటర్ల జాబితాను వినియోగించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించారు.
మున్సిపోల్స్‌కు ముందు మద్యం బంద్: ఉత్తర్వులు జారీ
మున్సిపల్ ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే 146 మున్సిపాలిటీలు, పది మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలు వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇలావుండగా ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి చెందిన గుర్తింపు చిహ్నాలు వాడడానికి వీల్లేదని తెలిపారు.
వాహనాలపైనే కాకుండా ఇంటిపైన, ఆస్తులకు సంబంధించిన వాటిలో పార్టీలతో ప్రమేయం కానీ, వాటి చిహ్నాలు కానీ ఉంచరాదని స్పష్టం చేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం మినహా మరే విధంగానూ తమ విధానాన్ని బయట పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు చూశాకే
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతి కానీ, తమ న్యాయవాది నివేదిక కానీ వచ్చాక ఒక నిర్ణయానికి వస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల జాబితాను ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు.
- రమాకాంత్‌రెడ్డి