
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త రాష్ట్రం కావడం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొదటికి రానుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 1995లో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. జనాభా ఆధారంగా మండలం యూనిట్‌గా ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు.
జనరల్, జనరల్ మహిళ,బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా కేటగిరీలు ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో అన్ని కేటగిరీలు వర్తింపజేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాలకు నాలుగు రకాల రిజర్వేషన్లు వర్తింపజేశారు. మిగతా నాలుగు కేటగిరీలను వంతుల వారీగా అమలు చేయాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావడంతో గ్రామాల్లో ఇప్పటికే అమలైన రిజర్వేషన్లు మళ్లీ ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఖరారయ్యే రిజర్వేషన్ కేటగిరీలు వరుసగా రెండు ఎన్నికలకు వర్తిస్తాయి.
జూన్ నుంచి ఖరారు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ జూన్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోంది. మే 17న ఓటర్ల తుది జాబితాను అన్ని పంచాయతీలలో ప్రదర్శించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా బీసీ ఓటర్ల గణన జరగనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మే 18 నుంచి ఇది మొదలై రెండు వారాలపాటు కొనసాగనుంది. జూన్ 3 కల్లా పూర్తయ్యే అకాశం ఉంది. అనంతరం వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment