ఫలితాలు వెల్లడించాక హన్వాడ మండలం అమ్మాపూర్ తండాలో టీఆర్‌ఎస్ మద్దతుదారుల సంబరాలు
జడ్చర్ల టౌన్ : అదే జోరు కొనసాగింది! అధికార టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు.. ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలోని 719 పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుండగా.. మొదటి దశ పోలింగ్ 21వ తేదీన ముగిసింది. ఈ దశలో 249 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులకు 145 స్థానాలు దక్కాయి. ఇక రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా 201 సీట్లను అధికార టీఆర్‌ఎస్ మద్దతుదారులు దక్కించుకోవడం విశేషం. అలాగే, మొదటి దశలో 59 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు.. ఈ దశలో కేవలం 20 సీట్లకే పరిమితం కావడం, బీజేపీకి రెండు సీట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వీరు మినహాయిస్తే మరో 20 సీట్లలో సర్పంచ్‌లుగా స్వతంత్రులు గెలుపొందారు. అయితే, వీరిలో చాలా మందిటీఆర్‌ఎస్ రెబెల్స్ కావడంతో ఈ స్థానాలు కూడా అధికార పార్టీ ఖాతాలో పడినట్లుగానే భావిస్తున్నారు.
ఉత్కంఠ...
రెండో విడతగా 721 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, ఇందులో రెండింటి పాలకవర్గాల పదవీకాలం ముగియకపోవడంతో 719 పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయగా.. కాగా, ఒక్కో నామినేషన్ దాఖలైనవి, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కటే మిగిలినవి 58 జీపీలు ఉండడంతో ఇవి ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. మిగిలిన 185 పంచాయతీల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఆయా స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 594 మంది బరిలో ఉన్నారు. ఇక ఏకగ్రీవమైన 697 వార్డులు మినహాయిస్తేమిగిలిన 1,369 వార్డుల్లో 3,427 మంది పోటీలో మిగిలారు. ఈ మేరకు శుక్రవారం పోలింగ్ నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కటొక్కటిగా ఫలితాలను వెల్లడించారు.
2 గంటల నుంచి కౌంటింగ్
ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొసాగింది. అనంతరం గంట పాటు ఉద్యోగులకు భోజన విరామం సమయం కేటాయించారు. ఆ తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచారు. ముందుగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్లను వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టారు. ఇక తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించాక.. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ నెలకొంది. తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడించగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులతో పాటు మద్దతు దారులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఫలితాలు వెల్లడయ్యాక గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోగా.. ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు. వార్డు సభ్యుల ఫలితాలను తొలుత వెల్లడించడంతో ఎవరి ప్యానల్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారో వారు తమకు ఉప సర్పంచి పదవి కావాలని లాబీయింగ్ మొదలుపెట్టారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించడం పూర్తి కాగానే అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. పార్టీల వారీగా విడిపోయిన వార్డుసభ్యులు తమ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా ఉందంటూ ఉప సర్పంచ్ పదవి కోసం పట్టుపట్టడం కనిపిచింది.
Comments
Please login to add a commentAdd a comment