గ్రామస్తులను విచారిస్తున్న పోలీసులు
కడెం(ఖానాపూర్): కడెం మండలం నవాబ్‌పేటలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట అనుకున్న ప్రకారం సర్పంచ్ పదవి తన భార్యకే ఇవ్వాలని కోరుతూ జెల్ల శంకరయ్య అనే వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం తనను కాదని కొందరు కక్షతో వేరే వారితో నామినేషన్ వేయించి, తనను మానసిక క్షోభకు గురి చేశారని పేర్కొంటూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని శంకరయ్యను సముదాయించి కిందకు దింపారు. ఎస్సై క్రిష్ణకుమార్ శంకరయ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, అర్హత ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చని వివరించారు. పోటీలో ఉండి గెలవాలే తప్పా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం నేరమని తెలిపారు.
జరిగింది ఇది..
కడెం మండలంలోని నవబ్‌పేట్ పంచాయతీకి అనుబంధంగా లక్ష్మీపూర్ గ్రామం ఉంటుంది. ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీపూర్ గ్రామస్తుడే సర్పంచ్‌గా గెలుస్తూ వచ్చాడు. ఈసారి ఎలాగైన నవబ్‌పేట్‌కు చెందిన వ్యక్తే సర్పంచ్ అవ్వాలని గ్రామస్తుల తీర్మానించుకున్నారు. ఈనెల 5వ తేదీన గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉండే వారు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాగా పది మంది పోటీ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు పది మంది పెద్దమనుషులు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ఎవరు పేరును ప్రకటిస్తే వారికి మద్దతు ఇవ్వాలని ఒప్పంద పత్రం రాసుకుని సంతకాలు చేశారు.
పది మందిలో జెల్ల లావణ్యను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించగా ఆమె భర్త శంకరయ్య గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఒప్పంద పత్రంపై సంతకాలు పెట్టిన జుట్టు శంకరయ్య, రాపెల్లి కొండయ్య తనపై కక్షతో రెండు రోజుల తర్వాత గొల్లపెల్లి కావేరి అనే మహిళతో పథకం ప్రకారం మొదట నామినేషన్ వేయించారని శంకరయ్య ఆరోపించాడు. ఆ తర్వాత వారిద్దరి కుటుంబ సభ్యులతో నామినేషన్ వేసి తనను మానసికంగా క్షోభకు గురిచేశారని అంటున్నాడు. అందుకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment