
కైలాస్‌నగర్ (ఆదిలాబాద్): ఓ హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్ బుధవారం జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. గత డిసెంబర్ 18న సయ్యద్ జమీల్, ఆయన కుటుంబసభ్యులపై ఫారుఖ్ తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీల్ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఫారుఖ్‌పై హత్య కేసు నమోదైంది. అప్పటినుంచి జిల్లా జైల్లో ఖైదీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌లో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, ఫారుఖ్ అహ్మద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, పోలీసులు.. రాజకీయ నాయకులు కుమ్మక్కై అతడిని చంపడానికి చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారుఖ్‌కు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనస్తాపం చెంది ఉండవచ్చు
రెండు రోజుల క్రితం ఫారుఖ్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో మనస్తాపం చెంది ఉండవచ్చు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆతడికి కౌన్సెలింగ్ ఇచ్చాం. హైకోర్టును ఆశ్రయించాలని సూచించాం. కప్పుకునేందుకు ఇచ్చిన దుప్పటిని చించి.. బాత్రూమ్‌లో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన మా సిబ్బంది వెంటనే ఆయనను రక్షించి రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాం.
– శోభన్ బాబు, ఆదిలాబాద్ జైలర్
Comments
Please login to add a commentAdd a comment